ఉగ్రవాదం అంతం చేస్తేనే చర్చలు.. భారత్ స్పష్టం

జమ్ముకశ్మీర్ అంశంపై చర్చలు జరుపాలంటే ముందుగా పాకిస్థాన్ తమ ప్రాంతంలోని ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో మరోదేశానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 

మండలి సమావేశం నేపథ్యంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో మరోదేశానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా కొందరు సమస్యను భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్‌పై పరోక్షంగా మండిపడ్డారు. 

రెండు దేశాల మధ్య సమస్యను పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకోవడం ఒక దేశం లక్షణం కాదు. ఉగ్రవాదం ఉండగా చర్చలకు ఏ ప్రజాస్వామ్య దేశమూ ఒప్పుకోదు. కాబట్టి ఉగ్రవాదాన్ని ఆపి.. చర్చలకు రండి అని స్పష్టంచేశారు. 

భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో జమ్ముకశ్మీర్ ప్రజలకే మేలు కలుగుతుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు సుపరిపాలన అందించడం, సామాజికంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం, పార్లమెంట్ కట్టుబడి ఉన్నది అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుచర్యగా ఆంక్షలు విధించామని, ఫలితంగా ఒక్క దుర్ఘటన కూడా జరుగలేదని చెప్పారు. 

ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ భద్రతామండలి సభ్యదేశాలకు వివరించామన్నారు. కశ్మీర్ అంశంలో ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం. అయినా కొందరు (పాకిస్థాన్) కశ్మీర్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఏదో జరుగుతున్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

కశ్మీర్ సమస్య భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని భద్రతామండలి భావిస్తున్నా.. పాకిస్థాన్, చైనా కలిసి వారి సొంత వాదనను భద్రతా మండలికి ఆపాదిస్తున్నాయని, ప్రంపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేకించి ఒకదేశం (పాకిస్థాన్), ఆ దేశ నాయకులు జీహాద్ భాషను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో హింసను ప్రేరేపిస్తున్నారు అని ధ్వజమెత్తారు. 

అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడుతుండగా ఓ సరదా సన్నివేశం జరిగింది. ఆయన మాట్లాడుతుండగా పాక్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ పాకిస్థాన్‌తో చర్చలను భారత్ ఎప్పుడు ప్రారంభిస్తుంది? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వెంటనే పాక్ విలేకరుల వద్దకు వెళ్లి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు.