విదేశీ పర్యటనలపై భారతీయుల మోజు

 విదేశీ పర్యటనల కోసం భారతీయులు చేస్తున్న వ్యయం గణనీయంగా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్‌లో విదేశీ పర్యటనల కోసం భారతీయులు ఏకంగా రూ. 4,243 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రపంచ పర్యాటక సంస్థ పేర్కొన్నది. 2019లో మొత్తం 5 కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలు చేస్తారని అంచనా వేసింది. 2017లో ఈ సంఖ్య కేవలం 2.4 కోట్లే. ఇక విదేశీ పర్యటనల కోసం ఫారెక్స్ (విదేశీ మారక ద్రవ్యం) నిల్వలను కొనడం తెలిసిందే. ఈ ఏడాది 

ఏప్రిల్-జూన్‌లో దేశ ప్రజలు రూ. 29,780 కోట్ల విలువ గల విదేశీ కరెన్సీని కొనుగోలు చేశారు. ఇందులో రూ. 11,353 కోట్ల(42శాతం) విదేశీ మారక ద్రవ్యాన్ని కేవలం పర్యటనల కోసమే కొనుగోలు చేశారు. 2014లో సరళీకృత చెల్లింపుల పథకం ప్రారంభించిన తర్వాత ఇదే రికార్డు కొనుగోలు. 

ఏటా రెండు కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని, అయితే, వీళ్లు స్వదేశీ పర్యటనలు ప్రారంభిస్తే వసతులు మెరుగుపడుతాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని  నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2022 నాటికి దేశంలోని 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకోవాలంటూ దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.  

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డాలర్ కొనుగోలును వివిధ రకాలుగా విభజించింది. గణాంకాల ప్రకారం.. 2019 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు రూ. 98,293 కోట్ల విలువ గల విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ. 34,188 కోట్లు (35శాతం) విదేశీ పర్యటనల కోసం వెచ్చించారు. రూ. 25,641 కోట్లు (26 శాతం) విద్యకు, రూ. 19,943 కోట్లు (20 శాతం) బంధువుల కోసం ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్న బంధువులకు బహుమతులు ఇవ్వడానికి భారతీయులు ఏకంగా రూ. 9,971 కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యకరం.