మద్దతు ధరకోసం కేంద్రం పెద్ద ముందడుగు

రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.15,053 కోట్లతో పంట ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ప్రకటించింది. రైతులకు పరిహారం చెల్లించేందుకు ఒక పథకాన్ని ఎంపిక చేసుకోవడంతోపాటు ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే అవకాశాన్ని రాష్ర్టాలకు కల్పించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా దిగువకు నూనె గింజల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించే కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్పీకి దిగువకు పంట ఉత్పత్తుల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించేందుకు అమలు చేస్తున్న పలు పథకాలలో ఒకదానిని ఎంపిక చేసుకొనే అవకాశం రాష్ర్టాలకు కల్పించారు. అలాగే ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలను అనుమతించనున్నారు.

కొత్త విధానం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ్ అభియాన (పీఎం-ఆశ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తుల ధరలు ఎంఎస్పీ కన్నా దిగువకు పడిపోయినప్పుడు రాష్ర్టాలు రైతులకు పరిహారం చెల్లించేందుకు పీఎం-ఆశ కింద మూడు పథకాల నుంచి ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. అవి ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్), కొత్తగా రూపొందించిన ధరల లోటు చెల్లింపు పథకం (పీడీపీఎస్), పైలట్ ప్రాతిపదికన అమలయ్యే ప్రైవే టు సేకరణ స్టాకిస్టు పథకం (పీపీపీఎస్).

రెండేండ్ల పాటు పీఎం-ఆశ అమలు కోసం ప్రభుత్వం రూ. 15,053 కోట్లను మంజూరు చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ చెప్పారు. పంట ఉత్పత్తుల సేకరణ సంస్థలకు ఇచ్చే రుణ పరిమితిని మరింత పెంచామని తెలిపారు. మరో రూ.16,550 కోట్లకు ప్రభుత్వం గ్యారంటీని ఇచ్చేందుకు అంగీకరించిందని, దీంతో పంట ఉత్పత్తుల సేకరణకు కేటాయించిన మొత్తం వ్యయం రూ.45,550 కోట్లకు చేరిందని మంత్రి చెప్పారు.

పీఎం-ఆశ కింద అమలు చేయనున్న మూడు పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.

పీఎస్‌ఎస్: పప్పు దినుసులు, నూనెగింజలు, కొబ్బెరను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర సంస్థలు సేకరిస్తాయి. సేకరణ వ్యయం, సేకరణ వల్ల కలిగే నష్టాలను కేంద్రం 25 శాతం వరకు భరిస్తుంది.

పీడీపీఎస్: ఈ పథకం కింద హోల్‌సేల్ మార్కెట్‌లో నెల రోజుల నూనెగింజల సగటు ధరకు, ఎంఎస్పీకి మధ్యనున్న లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. దీనిని రాష్ట్రంలో ఉత్పత్తి అయిన నూనెగింజల్లో 25 శాతం ఉత్పత్తికికి మాత్రమే వర్తింపచేస్తారు. పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన ఎనిమిది జిల్లాల్లో రాష్ర్టాలు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నూనె గింజల సేకరణకు ఈ పథకాన్ని అమలు చేయవచ్చు.

పీపీపీఎస్: ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రైవేటు సంస్థల ప్రమేయం కేవలం నూనెగింజలకు మాత్రమే పరిమితం అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వంట నూనెల దిగుమతిని తగ్గించే క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త ధాన్య సేకరణ విధానం అమలులోకి వస్తే రైతులకు తప్పనిసరిగా మద్దతు కొత్త విధానం ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు మార్కెట్ ధరలు తగ్గిన పక్షంలో కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఫలితంగా దళారులు తమ ఇష్టారాజ్యంగా పంట ఉత్పత్తులకు ధరలను నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేసేవారు. కొత్త విధానంతో అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనుంది.

కొంతమంది అధికారులు, పాలకుల స్వార్థంతో దళారులకు కొమ్ముకాస్తూ మార్కెట్‌ను శాసించేవారు. కృతిమంగా పంట ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం, తగ్గించడం చేయడంతో రైతులకు న్యాయం జరిగేది కాదు. కానీ కొత్త విధానం వల్ల మార్కెట్‌లో మద్దతు ధర కంటే పంట ఉత్పత్తులకు తక్కువ ధర వస్తే ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించేలా హామీ ఉండడంతో ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది.

తదనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌లోని ధరలపై ప్రభుత్వం ఆజమాయిషీ తీసుకుని  రైతులకు మద్దతు ధర కల్పిస్తుంది. ఇదిలావుంటే.. 22 పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల ఈ పంటల ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచారు. కొత్త ధాన్య సేకరణ విధానం వల్ల కేంద్రంపై రూ.40వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రం అంచనా వేసింది. అలాగే లీటర్ ఇథనాల్‌కు ఇప్పుడు వస్తున్న రూ.47.5లను ఏకంగా రూ.52కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.