`అధికరణ 370 రద్దు' పిటిషనర్లపై సుప్రీం ఆగ్రహం

అధికరణ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌దారులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి పిటిషన్‌ వేశారంటూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మను ప్రశ్నించారు. అరగంటపాటు చదివినా వ్యాజ్యం ముఖ్య ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ పిటిషన్‌ కొట్టివేస్తే సంబంధిత ఐదు వ్యాజ్యాలపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

ఈ విషయంపై మొత్తం 7 పిటిషన్లు దాఖలు కాగా  అందులో నాలుగింటిలో లోపాలున్నాయని తెలిపారు. ఏం కోరుకుంటున్నారో స్పష్టత లేకుండా వ్యాజ్యం ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దీంతో పిటిషన్‌లో సవరణలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది శర్మ కోరారు. 

ఈ సందర్భంగా కశ్మీర్‌లో మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ద కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధా బేసిన్‌ వేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే స్పందిస్తూ ల్యాండ్‌లైన్‌ వ్యవస్థ పనిచేస్తోందని, ఈరోజు ఉదయం కశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో మాట్లాడినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు. దీంతో కేంద్రానికి మరికొంత సమయం ఇద్దామన్న ధర్మాసనం దీనిపై మరోసారి విచారిద్దామంటూ వాయిదా వేసింది. అయితే తేదీ మాత్రం ఖరారు చేయలేదు.