70 ఏళ్ళలో చేయలేనిది 75 రోజుల్లో చేసి చూపించాం

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళలో చేయలేని పనిని తాము 75 రోజుల్లో చేసి చూపించామని కేంద్రహోం మంత్రి అమిత్‌షా తెలిపారు. 70 ఏళ్ళ వరకు ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పార్టీ లేనిపోని రాజకీయాలు చేసిందని, కానీ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే రద్దు చేశామని గుర్తు చేశారు. హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగిన ‘ఆస్థార్యాలీ’ లో అమిత్‌షా పాల్గొంటూ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ 370 ని రద్దు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత దేశ అఖండతా కోసం,ఏకతా కోసమే దానిని రద్దు చేశామని తెలిపారు. 370 ని రద్దు చేసినందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకూ అందరూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని షా ఆనందం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఆర్టికల్ 370 అడ్డుకుందని, ఎప్పుడైతే తాము 370 ని రద్దు చేశామో అప్పటి నుంచి ఇక కశ్మీర్, లడ్డాఖ్ ప్రాంతాలు అభివృద్ధిలో శీఘ్ర గమనంతో దూసుకెళ్తాయని, అలాగే తీవ్రవాదం అంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇన్నాళ్లు ఓటుబ్యాంకు కోసమే కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడిందని, కానీ ప్రధాని మోదీ ఓటుబ్యాంకు కోసం ఎన్నడూ లాలూచీ పడలేదని, కేవలం దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే హర్యానా ఎన్నికల్లో తిరిగి బీజేపీ విజయం సాధిస్తుందని, గతం కంటే మరింత మెజారిటీని సాధిస్తామని అమిత్‌షా ధీమా వ్యక్తంచేశారు.