మోదీ చెప్పారు కదా, ఇక అయిపోయినట్లే

‘ఒక దేశం - ఒకేసారి ఎన్నికలు’ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంటున్న కలలు నిజమవుతాయని శివసేన పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ‘సామ్నా’ సంపాదకీయం ప్రశంసించింది.

‘ఒక దేశం - ఒకేసారి ఎన్నికలు’పై మోదీ తన అభిప్రాయాలను వెల్లడించారని, ఈ విధానం త్వరలోనే నిజమవుతుందని ‘సామ్నా’ పేర్కొంది.  ప్రధాని మోదీ గురువారం స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ‘ఒక దేశం - ఒకేసారి ఎన్నికలు’ గురించి ప్రస్తావించారు. అధికరణ 370 రద్దు ‘ఒక దేశం-ఒకే రాజ్యాంగం’ దిశగా ఓ ముందడుగు అని తెలిపారు. వస్తు, సేవల పన్ను అమలు ‘ఒక దేశం-ఒకే చట్టం’ దిశగా ఓ ముందడుగు అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ‘సామ్నా’ సంపాదకీయం మోదీని ప్రశంసించింది. మోదీ తాను మాట్లాడే వేదికలను ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటి పరిష్కారాలను ప్రజలకు తెలియజేయడానికి వినియోగించుకుంటారని పేర్కొంది. అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సురక్షిత తాగునీటి సదుపాయం, జనాభా నియంత్రణ, ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు గురించి మోదీ మాట్లాడారని పేర్కొంది. మోదీ చెప్పినవన్నీ త్వరలోనే అమలవుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చునని పేర్కొంది.