రాహుల్ పై వృద్ధుల ‘తిరుగుబాటు’

చలసాని నరేంద్ర

2019 ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత పది వారాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. తొలుత అందరు ఈ రాజీనామాను ఒక నాటకంగా పరిగణించారు. తిరిగి ఆయనే పదవి చేపడతారని భావించారు. ఆయనను ఆ పదవిలో కొనసాగమని ఒప్పించడం కోసం చివరివరకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అనూహ్యంగా పది వరాల తర్వాత రాహుల్ మాతృమూర్తి సోనియా గాంధీని తిరిగి పార్టీ అధ్యక్షుడిగా చేశారు.

సుదీర్ఘ కాలం పార్టీకి సారథ్యం వహించిన సోనియా కాకుండా మరెవ్వరిని పార్టీ అధ్యక్షుడిగా చేసినా పార్టీ ముక్కలై పోతుందని, అందుకనే ఆమెను ఎంచుకున్నామని ఈ సందర్భంగా ఒక వివరణ ఇచ్చుకున్నారు. ఆ పార్టీ దౌర్భాగ్య పరిస్థితిని ఈ వివరణ వెల్లడి చేస్తుంది. అయితే సోనియాకు తిరిగి పార్టీ సారథ్యం అప్పచెప్పడం అందరికన్నా ఎక్కువగా రాహుల్ గాంధీకి విస్మయం కలిగించింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో రాహుల్ గాంధీ పాత్రను పరిమితం చేయడం కోసం సోనియా గాంధీ నీడలో ప్రజాబలం లేకుండా ఆ పార్టీపై ఆధిపత్యం వహిస్తున్న వృద్ధ నాయకత్వం జరిపిన ఒక విధమైన తిరుగుబాటు ఫలితంగా ఈ మార్పు జరిగినదని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ ఏ ఉద్దేశాలతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో, ఆ ఉద్దేశాలు నెరవేరకుండా, పార్టీని తమ పట్టు నుండి జారిపోకుండా చేసుకోవడం కోసం ఈ విధంగా చేసారని స్పష్టం అవుతుంది.

ఎన్నికలలో ఘోర పరాజయానికి ఒక వంక బాధ్యత వహిస్తున్నామని అంటూనే వృద్ధ నాయకత్వం ధోరణి అందుకు ప్రధాన కారణం అంటూ మే 25న ఎఐసిసి సమావేశంలో నేరుగా కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కమల్ సింగ్, గెహ్లాట్, చిదంబరం వంటి నేతలు తమ కుమారుల సీట్లపై చూపిన శ్రద్ధను పార్టీ ప్రచారంపై చూపలేదని రాహుల్ గాంధీ నిష్టూరంగా మాట్లాడారు. పైగా, తన స్థానంలో తమ కుటుంబంలో – సోనియా, ప్రియాంక లలో ఎవ్వరిని కూడా పార్టీ అధ్యక్ష స్థానంలో నియమించవద్దని కూడా స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ అనగానే వారసత్వ రాజకీయం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా విమర్శలు కురిపించారు. అట్లాగే యుపిఎ పాలనలో అవినీతిని ప్రస్తావించారు. ఈ విమర్శల నుండి ఉపశమనం పొందటం కోసం రెండు, మూడేళ్లు మరొకరిని, ముఖ్యంగా యువనేతను పార్టీ అధ్యక్ష పదవిలో ఉంచాలని రాహుల్ భావించారు. పైగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను పక్కన బెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఆ విధంగా జరిగితే పార్టీపై తమ పట్టు కోల్పోవలసి వస్తుందని వృద్ధ నాయకత్వం గ్రహించింది. అందుకనే సోనియా తప్ప గత్యంతరం లేదని పరిస్థితులు కల్పించారు. ఆగష్టు 10న రాత్రి పొద్దు పోయిన తర్వాత సోనియా ఎంపికను ప్రకటించడం గమనార్హం. ఒక విధంగా రాహుల్ తో సంబంధం లేకుండా వృద్ధ నేతల వత్తిడులకు లొంగి ఆమె ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి రెండు, మూడేళ్ళ ముందు నుండే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటువంటి పర్యటనలను వృద్ధ నాయకత్వం తమదైన రీతిలో ప్రతిఘటిస్తూ వచ్చింది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె ఎన్నికల ప్రచారం చేయడం అటుంచి కనీసం పర్యటనలు కూడా చేయలేక పోతున్నారు. అటువంటప్పుడు ఆమెకు పార్టీ సారధ్యం అప్పచెప్పడం అంటే ఆమెను ఒక ఉత్సవ విగ్రహంగా ఉంచి తమ పబ్బం గడుపుకునే ఎత్తుగడ వృద్ధ నాయకత్వం వేయడమే.

తన రాజీనామాతో వృద్ధ నాయకత్వం అంతా పార్టీ పదవులను వదులు కుంటారని, పార్టీలో నూతన తరానికి నాయకత్వ బదిలీ జరుగుతోందని రాహుల్ ఆశించారు. కానీ అందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా గాంధీ ఏనాడు పార్టీ సంస్థాగత వ్యవహారాలను పట్టించుకోలేదు. అందుకనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం కోల్పోయింది. పార్టీకి యువ నాయకత్వం కరువైనది. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలే కరువయ్యారు.

రాహుల్ గాంధీ తొలి నుండి భిన్నమైన రాజకీయ ధోరణులు అవలంబిస్తున్నారు. నేరుగా ప్రజలకు చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంపై రాజీలేని వైఖరి అవలంబిస్తున్నారు. పార్టీలో యువతకు కీలక బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాహుల్ చేసే ఈ ప్రయత్నాలు అన్నింటిని అడ్డుకొనే ప్రయత్నం వృద్ధ నాయకత్వం చేస్తూనే ఉన్నది. వృద్ధ నేతలు ఎవ్వరు బలమైన మోడీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధంగా లేరు. లోపాయికారి అవగాహనకు కూడా సిద్ధపడుతున్నారు.

ఎన్నికల ముందు పేదలకు సాలీనా రూ 72,000 నగదు బదిలీ చేసే రాహుల్ పథకం ప్రజల వద్దకు చేరకుండా చూడడంలో వృద్ధ నాయకత్వం పాత్రను కూడా విస్మరింపలేము. రాహుల్ పార్టీ వ్యవహారాలు చేపడుతున్నప్పటి నుండి వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కు పరాజయం ఎదురు కాగానే ప్రియాంక గాంధీ పార్టీ సారథ్యం చేపట్టాలి అంటూ ఢిల్లీలో ఎఐసిసి కార్యాలయం వద్ద ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రదర్శనల వెనుక ఉన్నది కూడా వృద్ధ నాయకత్వమే అన్నది అందరికి తెలిసిందే.

సోనియా, ప్రియాంక వంటి నేతలు క్షత్రస్థాయిలో పరిస్థితుల గురించి గాని, పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరచడం పట్ల గాని పట్టించుకోరని, పార్టీ ఎంత బలహీనంగా ఉంటె పార్టీపై తమ పెత్తనం అంత ఎక్కువగా కొనసాగుతుందని వృద్ధ నాయకత్వం భావిస్తూ వస్తున్నది. కానీ రాహుల్ ‘సూట్ బూట్ సర్కార్’ , ‘గబ్బర్ సింగ్ టాక్స్’ వంటి పదజాలంతో, రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో లొసుగులని ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడవేస్తున్నారు.

ఆ విధంగా ప్రజల దృష్టిని కూడా ఆకట్టుకొంటున్నారు. ఇటువంటి ఆరోపణలలో పార్టీ నాయకత్వం తనకు అండగా ఉండటం లేదని రాహుల్ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి బలమైన నాయకులకు రాహుల్ గాంధీ సాటి కాలేక పోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో ఆ ఇద్దరు నేతలను అనేక సందర్భాలలో ఇరకాటంలో పడవేస్తున్నది రాహుల్ మాత్రమే కావడం గమనార్హం. ప్రజాబలం సమకూర్చుకోగల నేతలు అందరిని దూరంగా ఉంచే ప్రయత్నం వృద్ధ నాయకత్వం చేస్తున్నది. లోక్ సభలో పార్టీ నేతగా అధిర్ రాజన్ చౌదరిని ఎంపిక చేయడంలోనే ఈ విషయమై స్పష్టమైనది. లోక్‌సభలో సమర్ధవంతంగా వ్యవహరిస్తే పార్టీలో బలమైన నేతగా ఎదుగుతారని భయంతో, అటువంటి అవకాశం లేని చౌదరిని ఎంపిక చేశారు. కశ్మీర్ విషయమై లోక్‌సభలో అడ్డదిడ్డంగా మాట్లాడి సోనియా గాంధీని సహితం ఇరకాటంలో పడవేయడాన్ని చూసాము.

ఒక వంక పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దుస్థితిలో, నానాటికి కుంచించుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టు సాధించుకొంటుందనే విశ్వాసం ప్రజలలో కనిపించడం లేదు. బిజెపికి వ్యతిరేకంగా ఇతర ప్రతిపక్షాలను సమీకరించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలం అవుతున్నది. ప్రతిపక్షాలలో చీలిక తీసుకు రావడంలో అమిత్ షా ఘన విజయం సాధించారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవర్ వంటి నేతలతో ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించలేక పోతున్నారు.

పలు చోట్ల ప్రతిపక్షాల బలహీనతలే బిజెపికి బలంగా మారుతున్నాయి. అయినా ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యవహరింపలేక పోతున్నారు. అందుకు ప్రధానంగా నాయకుల మధ్య సయోధ్య కరువవడమే కారణం అని చెప్పవచ్చు. ప్రతిపక్షాల విశ్వాసం పొందడం నేడు కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాల్. అందుకోసం కర్ణాటకలో కేవలం 37 మంది ఎంఎల్‌ఎలు ఉన్న జెడిఎస్ కు అధికారం అప్పజెప్పి రాహుల్ గాంధీ పెద్ద ప్రయోగం చేశారు. అయితే ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.

నేడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విధానపరమైన సంశయం. కీలకమైన ఏ విషయంపై కూడా ఉమ్మడిగా ఒక విధానం అవలంబించలేక పోతున్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ నేతలు భిన్నమైన విరుద్ధ వాదనలు వినిపిస్తూ ఉండటం గమనార్హం. రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తెరపైకి వచ్చిన పేర్లు – జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవర, దీపేందర్ హోదా, జితిన్ ప్రసాద, ఆర్ పి ఎన్ సింగ్. రాహుల్ అమేథీలో ఓటమి చెందగా వీరంతా కూడా లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందినవారు కావడం గమనార్హం. పైగా, వీరంతా ఆర్టికల్ 370పై బిజెపికి విధానానికి మద్దతు తెలపడం గమనార్హం.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరివలే తయారైంది. బిజెపి కూడా అదే కోరుకొంటున్నది. కాంగ్రెస్ ఎంత దీనావస్థలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అంటేనే బిజెపి నాయకత్వం ఉలిక్కి పడుతున్నది. కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించకుండా ప్రధాని నుండి మరే నేత కూడా ప్రసంగం చేయలేని పరిస్థితులలో ఉన్నారు.

(మన తెలంగాణ సౌజన్యంతో)