వాజ్‌పేయీ ప్రథమ వర్ధంతి.. నేతల ఘన నివాళి

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ప్రముఖ నేతలు, బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం అటల్‌ సదైవ్‌ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయీ కూతురు నమితా భట్టాచార్యతో పాటు మనవరాలు నిహారిక సైతం శ్రద్ధాంజలి ఘటించారు.

నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి  కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. బిజెపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్‌పేయీ గత సంవత్సరం ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1998-2004 మధ్య ప్రధానిగా సేవలందించారు. గతంలో జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. ఆయన జయంతి డిసెంబర్‌ 25ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వాజ్‌పేయి తొలి వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు.

1924 డిసెంబర్ 25న మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. 2015లో భారత ప్రభుత్వం వాజ్‌పేయికి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం అందించింది. నాలుగు దశాబ్ధాల పాటు ఎంపీగా పదిసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.

క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యేంత వరకూ వాజ్‌పేయి యూపీలోని లక్నో నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ఆయన స్మృత్యర్థం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ సమీపంలో రూ.10.51 కోట్ల వ్యయంతో ‘సదైవ అటల్’ను నిర్మించారు. అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ 1.5 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించింది.