ముగిసిన అమర్‌నాథ్ యాత్ర

పవిత్రమయిన అమర్ నాథ్ యాత్ర గురువారం ముగిసింది. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ ఆలయంలో జరిగే ఈ యాత్రకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే, ఈ సంవత్సరం మధ్యలోనే యాత్రను రద్దు చేయడం వల్ల అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య సుమారు 3.39 లక్షలకు తగ్గింది.

శ్రావణ పూర్ణిమ అయిన గురువారం శివుడి పవిత్ర దండం అయిన ‘చర్రీ ముబారక్’ను సహజసిద్ధంగా మంచుతో ఏర్పడిన శివలింగం వద్దకు తీసుకు రావడంతో అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. 16 రోజులు కుదించిన అమర్‌నాథ్ యాత్ర ముగిసిందని అధికారులు తెలిపారు. శివుడి పవిత్ర దండం సంరక్షకుడయిన మహంత్ దీపేంద్ర గిరి మరో 20 మంది పురోహితులతో కలిసి గురువారం హెలికాప్టర్‌లో అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. అనంతరం వారు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

సంరక్షకుడు అయిన గిరి నాయకత్వంలో యోగులు, భక్తుల బృందం శివుడి పవిత్ర దండాన్ని తీసుకొని వచ్చినట్టు వారు వివరించారు. సాధారణంగా యోగులు, భక్తులతో కూడిన ఈ బృందం పహల్‌గాం నుంచి ఆలయం వరకు 42 కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ రావడం ఆచారం. చందన్‌వారి, శేష్‌నాగ్, పంచ్‌తరణిలో ఈ బృందం రాత్రి వేళ బస చేస్తుంది.

జూలై ఒకటో తేదీన మొదలయిన 46 రోజుల యాత్రను అననుకూల వాతావరణం కారణంగా జూలై 31వ తేదీన నాలుగు రోజుల పాటు నిలిపివేశారు. తిరిగి మొదలయిన మూడు రోజుల తరువాత ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంగా జమ్మూకాశ్మీర్ పాలనాయంత్రాంగం ఈ యాత్రను నిలిపివేసింది.