జగ్గారెడ్డి అరెస్ట్ తో కెసిఆర్, హరీష్ లపై ఎదురు దాడి !

ముదస్తూ ఎన్నికలకు రంగం సిద్దమైన సమయంలో 14 ఏళ్ళనాటి కేసును హడావుడిగా తిరగతోడి,  మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్యెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిను అరెస్ట్ చేయడం తెలంగాణలోని రాజకీయ వర్గాలలో పెను దుమారమే రేపింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తున్న పలు అంశాలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో మరింతగా ముందుకు వెడితే జగ్గారెడ్డి పైకన్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆయన మేనల్లుడు, మంత్రి హరిశ్రావులపై ఎదురు దాడిని ఉధృతం చేయగలమనే సంకేతాన్ని కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారు. దానితో అధికారపక్షం తీవ్ర కలవరం చెందుతున్నది.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఈ సందర్భంగా ఈ కేసు మరింత సంచలనాలకు దారితీసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. జగ్గారెడ్డిని ఈ కేసులు అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు నిజంగా అరెస్ట్ చేయాలి అంటే కెసిఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలి అంటూ అధికార పక్షంపై బాణాలను ఎక్కుపెడుతున్నారు. దానితో ఈ కేసు అనూహ్య మలుపులు తీసుకొనే అవకాశాలు వెల్లడి అవుతున్నాయి.

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో వరుసగా ప్రతిపక్షాలపై పాత కేసులకు దుమ్ము దులిపి, వారిని ఇబ్బందిపాలు చేసే విధంగా అధికార పక్షం వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలలోకి ప్రతికూల సంకేతాలు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ సందర్భంగా మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడు రషీద్ అలీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌‌రావులను విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. 2007మే 22న నిందితుడు మహమ్మద్‌ రషీద్‌ అలీ సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్, హరీశ్‌ ‌రావు పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించడం అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పదవేస్తున్నది. పైగా నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడ జగ్గారెడ్డి పేరు లేదని చెబుతున్నారు.

ఎటువంటి ఆధారాలు లేకుండా అంత యధావిధిగా మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని పోలీస్ లు అరెస్ట్ చేసి ఉంటారంటే నమ్మశక్యం కావడం లేదు. 2007కు సంబంధించిన ఈ కేసులో గతేడాది ఆగస్టు 24న అప్పటి సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ఛార్జిషీట్‌ వేశారని రేవంత్ చెప్పారు. ఆ సమయంలోనే అధికార పార్టీకి చెందిన నేతల పేర్లను తొలగించారని ఆరోపిస్తున్నారు.

కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌ పర్యవేక్షించాల్సి ఉందని గుర్తు చేస్తూ తక్షణమే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అంటూ ఇప్పుడు గవర్నర్ ను రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకు వస్తున్నారు.

ఇట్లా ఉండగా జగ్గారెడ్డి జైలుకు వెళ్ళాక సంగారెడ్డిలో బుధవారం కాంగ్రెస్ నిర్వహించిన మైనారిటీ గర్జన సభకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరై ఆయనకు సంఘీభావం తెలపడంతో ఈ అరెస్ట్ రాజకీయ రంగు పులుముకొనే అవకాశాలను వెల్లడి చేస్తున్నది. జగ్గారెడ్డి భార్య నిర్మల సభలో పాల్గొని కన్నీరు మున్నీరయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.