సీడీఎస్ ఏర్పాటుకు 1999లోనే ప్రతిపాదనలు

త్రివిధ దళాల మధ్య సమన్వయం నెలకొల్పి, వాటికి నేతృత్వం వహించడానికి త్రివిధ దళాల ప్రధానాధికారిని (సీడీఎస్) నియమిస్తున్నట్లు స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల సైనిక వర్గాలలో, రక్షణ నిపుణులతో హర్షం వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి ఈ ప్రతిపాదన 19 ఏండ్లు గా ఉన్నది. సైన్యం, నావికా, వైమానిక దళాల మధ్య సమన్వయం తోపాటు సంయుక్త శిక్షణ, ప్రణాళిక, సంక్షోభ సమయంలో సమర్థంగా స్పందించడం, వ్యూహరచన వంటివి సీడీఎస్ బాధ్యతలు. '

1999 కార్గిల్ యుద్ధం తర్వాత దేశంలోని భద్రతా లోపాల గుర్తింపునకు కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి సమీక్షా కమిటీ తొలిసారిగా సీడీఎస్ ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. అత్యున్నత హోదా కల అధికారిని సీడీఎస్‌గా నియమించాలని, ఆయన రక్షణ మంత్రి సలహాదారుగానూ వ్యవహరించాలన్నది. దేశ భద్రతకు తీసుకోవా ల్సిన అత్యవసర చర్యలపై అధ్యయనానికి 2001లో ఏర్పాటైన మంత్రుల సంఘం సైతం సీడీఎస్ ఏర్పాటుచేయాలని స్పష్టంచేసింది.

ఆ తర్వాత నరేశ్ చంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ సైతం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి (సీవోఎస్సీ) శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని సూచించింది. సీవోఎస్సీ అనేది దేశ భద్రతకు సూచనలిస్తుంది. త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అధికారి దీనికి అధ్యక్షులుగా ఉం టారు. మాజీ సైన్యాధిపతి ఎన్సీ విజ్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ వంటి వారూ సీడీఎస్ ఏర్పాటు అత్యవసరమని పలు సార్లు చెప్పారు. 

అన్నిపార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకే సీడీఎస్ ఏర్పాటు పూర్తికావడం లేద ని 2016లో కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. రాజకీయ నేతలు సైన్యంపై పెత్తనం కోసమే సీడీఎస్‌ను వ్యతిరేకిస్తున్నారని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ విమర్శించారు. మోదీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సీడీఎస్ ఏర్పాటుపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నది. దివంగత పారికర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సీడీఎస్ ఏర్పాటుకు మలి ప్రయత్నాలు మొదలయ్యాయి.

త్రివిధ దళాల ప్రధానాధికారిని నియమిస్తామని ప్రధాని ప్రకటించినా.. పూర్తి వివరాలను చెప్పలేదు. సీడీఎస్ ర్యాంకు, హోదా, ఎవరు అర్హులు? వంటి వివరాలను త్వరలో ప్రకటిస్తారని అంచనా. త్రివిధ దళాల అధిపతుల్లో ఒకరిని సీడీఎస్‌గా నియమిస్తారని భావిస్తున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగతా వారికంటే సీనియరైనా 2 నెలల్లో రిటై రవుతా రు. దీంతో సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపడుతారనే ప్రచారముంది. ఆయన డిసెంబర్ 31న రిటైరవుతారు.

 సీడీఎస్‌పై మోదీ నిర్ణయం పట్ల కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యాధిపతిగా వ్యవహరించిన జనరల్ (రిటైర్డ్) వీపీ మాలిక్ హర్షం వ్యక్తం చేశారు.