గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షలమంది వాలంటీర్లు ఇవాళ్టి నుంచి విధుల్లోకి వచ్చారు. విజయవాడ ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రజల్లో నమ్మకం కలిగించేదే ప్రభుత్వం అని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థ తీసుకురావాలని అనుకున్నానని అందులో భాగంగానే ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 

మంచి చేయాలన్న తపన ఉన్న వ్యక్తులనే గ్రామవాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ సచివాలయంలో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఈ లెక్కన రాష్ట్రంలో 1.40 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం వెల్లడించారు.  ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. 

దాదాపు 4 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంటూ గ్రామ వాలంటీర్లు.. లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. ‘మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌,బైబిల్‌గా భావిస్తున్నాం. మేనిఫెస్టోలోని ప్రతి అంశం పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అక్టోబర్‌ 15న రైతు భరోసా, జనవరి 26న అమ్మఒడి ప్రారంభిస్తున్నాం. రైతు భరోసా కింద రూ.12,500 ఇచ్చి, వారికి అండగా నిలబడతాం’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. 

లబ్ధిదారులను గుర్తించడంలో వాలంటీర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. ‘‘ అక్టోబర్‌లో గ్రామ సచివాలయాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఇంటిస్థలం లేని పేదవాడు ఉండకూడదు. ఉగాది నాటికి అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తాం. ప్రతి లబ్ధిదారుడికి ఆ స్థలం ఎక్కడ ఉందో వాలంటీర్లు చూపించాలి. లబ్ధిదారుడిని గుర్తించడం.. డోర్‌ డెలివరీ చేయడం వాలంటీర్ల బాధ్యత’’అని సీఎం చెప్పారు.