ఆర్థికమాంద్యంపై దృష్టి సారించిన ప్రధాని

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ఆర్థికమాంద్యం చాప కింద నీరులా చేరుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ దానిపై దృష్టిసారించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాల గురించి వారితో చర్చించారు. 

ఏయే రంగాలపై ప్రభావం ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర విషయాల గురించి వారితో మాట్లాడారు.  ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 

దీర్ఘకాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆర్థిశాఖ వర్గాలు చెబుతున్నాయి. మాంద్యం బారిన పడకుండా రంగాల వారీగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.  2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి 6.8శాతంగా ఉంది. 2015-16 తర్వాత ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 

మరోపక్క విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు తగ్గడం కూడా ఆర్థిక వృద్ధిపై ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య మొదలైన వాణిజ్యయుద్ధం చినికిచినికి గాలివానగా మారి ఉప్పెనలా ప్రపంచదేశాలన్నింటినీ ముంచేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్త ఆర్థికమాంద్యం ప్రభావం భారతదేశం మీద మాత్రం మరీ అంత ఎక్కువగా ఉండే సూచనలు లేవని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ ఇటీవల అంచనా వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, వాహన పరిశ్రమల లాంటివి మందగమనంలో ఉన్నా.. మాంద్యం దరిచేరకపోవచ్చని అంటోంది. సవాళ్లను ఎదుర్కోడానికి ఆర్థికమంత్రిత్వశాఖ పరిశ్రమవర్గాలతో భేటీలు జరుపుతోంది. 

మందగమనాన్ని ఎదుర్కోడానికి పన్నుల తగ్గింపు లాంటి చర్యలు తీసుకోనుంది. దశాబ్దం క్రితం ఏర్పడిన అంతర్జాతీయ మాంద్యం సమయంలోనూ అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్‌పై ప్రభావం కొంత తక్కువే. వాటికంటే చాలా త్వరగా కూడా కోలుకుంది.