వ్యవస్థలను గాడిలో పెట్టాం, వేగంగా ముందుకు వెళ్తున్నాం

ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ వ్యవస్థలను గాడిలో పెట్టామని, వేగవంతంగా పనిచేసేలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేశామని, సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు చేశామని, వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. వచ్చే ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్నామని చెబుతూ ప్రభుత్వ ఏర్పడిన 10 వారాల్లోనే ప్రజలకు మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.

తలాక్ చట్టం ద్వారా ముస్లీం మహిళలకు సాధికారత కల్పించామని, రాజ్యంగ స్పూర్తితో ముస్లీం మహిళలకు సమాన హక్కులు కల్పించామని తెలిపారు. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించామని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, లడక్‌లో శాంతి స్థాపనే తమ లక్ష్యం అని చెబుతూ అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయని, ఆర్టికల్ 370 రద్దు చేసి సర్ధార్ వల్లాబాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చామని సంతోషం వ్యక్తం చేసారు.

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లభించిందని ప్రధాని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయని చెబుతూ గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ప్రజలకు అంతగా మేలు చేసేవే ఐతే స్వతంత్య్ర భారత దేశంలో 70 ఏండ్లుగా కశ్మీరీల జీవితాల్లో ఎందుకు మార్పు రాలేదని నిలదీశారు. అందుకే ఒకే జాతి- ఒకే రాజ్యంగం ఉండాలని,  దేశ ప్రజలతో పాటు కశ్మీరీ ప్రజలు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని తెలిపారు. 2014కు ముందు దేశ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే కాగా,  2014 నుంచి 2019 మధ్య 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని చెప్పారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి వంద లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని చెబుతూ ప్రజల ఆకాంక్షాల మేరకు పనికిరాని అనేక చట్టాలను తొలగించామని తెలిపారు.

అవినీతిని పారదోలేందుకు మొదటన్నుంచీ కృషి చేస్తున్నామని చెబుతూ  పారదర్శకతతో కూడిన బాధ్యతాయుత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ధరలను నియంత్రిచడం ద్వారా దేశాభివృద్ధి పెంపొదిస్తున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో విదేశాల్లోనూ విశ్వాసం పొందగలిగామని తెలిపారు.

ఒకే దేశం - ఒకే ఎన్నికలపై చర్చ జరగాలని ప్రధాని సూచించారు. మనమే కాదు, ఇరుగుపొరుగు దేశాలు కూడా ఉగ్రవాద బాధితులుగా మారాయని పేర్కొంటూ పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు కష్టాలు ఎదురొకంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని చెప్పారు.