రహస్య జిఓలలో టిడిపి బాటలోనే వైసిపి ప్రభుత్వం


పాలనాపరంగా రహస్య ఉత్తర్వులు జారీ చేసే విషయంలో గత టిడిపి ప్రభుత్వ బాటలోనే ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పయనిస్తున్నది. టిడిపి ప్రభుత్వం రహస్య జీవోలు ఇస్తోందని, పరిపాలనలో పలు విషయాలను ప్రజలకు తెలీకుండా గోప్యంగా ఉంచు తోందని ప్రతిపక్షంలో ఉండగా వైసిపి విమర్శించింది. తాము అధికారంలోకొస్తే పక్కాగా పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చింది. 

కాగా ఈ ఏడాది మే 30న జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మంగళ వారానికి సరిగ్గా 76 రోజులైంది. ఈ కాలంలో ప్రభుత్వం లోని వివిధ విభాగాల నుంచి 38 రహస్య ఉత్తర్వులు వెలువడ్డాయి. రోజుకు సగటున రెండు రహస్య జీవోలొచ్చాయి. కాన్ఫిడెన్షియల్‌ జీవోల్లో రెవెన్యూ శాఖది అగ్రస్థానం. ఆ విభాగం నుంచి ఈ కాలంలో 14 రహస్య జీవోలు విడుదలయ్యాయి. కనిష్టంగా వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల నుంచి ఒక్కొక్కటి చొప్పున కాన్ఫిడెన్షియల్‌ జీవోలు జారీ అయ్యాయి.

రెవెన్యూ, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కువగా విజిలెన్స్‌ దర్యాప్తులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో అవినీతి, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తులకు సంబంధించిన ఉత్తర్వులుగా జీవో టైటిల్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి వీటిపై ప్రజలకు తెలీకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. విచారణలో తేల్చిన అంశాలే వాటిల్లో పొందుపరుస్తారు. 

అవినీతి అక్రమాలపై ప్రజలకు పారదర్శకంగా తెలిస్తే సర్కారుపై నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అవినీతి లేని పాలన అందిస్తామంటున్న వైసిపి సర్కారు అవినీతి కేసులపై మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న కేసులపై ప్రస్తుత ప్రభుత్వం విచారణలను అంతటితో నిలిపివేసిన పక్షంలో మాత్రం సర్కారు అందిస్తానన్న అవినీతి రహిత పాలన హామీకి తూట్లు పడినట్లే కాగలదు. 

ఇదిలా ఉండగా ఇటీవల రహస్య జీవోల అంశంపై రాజకీయ దుమారం లేచింది. మచిలీపట్నం పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైసిపి ప్రభుత్వం  కాన్ఫిడెన్షియల్‌ జీవో జారీ చేసిందంటూ టిడిపి ఆరోపించింది. తాము రహస్య జీవోలేమీ ఇవ్వడం లేదని కొందరు మంత్రులు స్పందించారు. వారు చెబుతున్నట్లు 'మచిలీపట్నం' జీవో కాకున్నా ఈ ప్రభుత్వంలోనూ రహస్య జీవోలు వస్తున్నాయనేది మాత్రం నిజం.