కశ్మీర్‌లో మార్పులతో అక్కడి ప్రజలకే లబ్ధి

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు మార్పులు వల్ల అక్కడి ప్రజలు లబ్ధి పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు.  మహిళల సాధికారత కోసమే కొన్ని చట్టాలను సవరించామని చెప్పారు. 73వ స్వాతంత్ర్య దినోత్సం జరుపుకొంటున్న ఈ వేళ మనముందున్న లక్ష్యం దేశాభివృద్ధి అని, అందుకోసం సమష్టిగా పనిచేయాలని ప్రజలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘స్వాతంత్య్ర  దినోత్సవం జరుపుకోవడం మనకు గొప్ప పండుగ. జాతిపిత గాంధీ మనందరికీ మార్గదర్శకుడు. 73 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌ 2న గాంధీజీ 150వ జయంతి వేడుకలను జరుపుకోనున్నాం. అంతేకాదు గురునానక్‌ 550వ జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సమరయోధుల ఆకాంక్షలను మరోసారి గుర్తు చేసుకోవాలి" అని పేర్కొన్నారు. 

కొత్త తలాక్‌ చట్టం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూ మహిళల సాధికారత కోసమే చట్టాలను సవరించామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మార్పుల వల్ల జమ్మూకశ్మీర్‌ ప్రజలు లబ్ధి పొందుతారని, వారు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే సమాన హక్కులు, అధికారాలు, సౌకర్యాలు పొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

‘‘ఇటీవల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటేసేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ మనందరి లక్ష్యం దేశాభివృద్ధి. దేశంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం, దేశ ప్రతిష్ఠను ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. అందుకోసం 130కోట్ల మంది ప్రజలు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలి" అని పిలుపిచ్చారు. 

అభివృద్ధి కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతోందని చెబుతూ బతుకు, బతకనివ్వు అనేదే మన నినాదం అని తెలిపారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు సైతం చక్కటి వాతావరణంలో జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు.