జమ్ములో ఆంక్షల ఎత్తివేత... కశ్మీర్‌లో యథాతథం

అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించనున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.

శ్రీనగర్‌ లాంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదన్నారు. కొంతమందికి స్వల్ప గాయాలవ్వగా వారికి వెంటనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశామని తెలిపారు. సామాన్య ప్రజలకు ఎటువంటి హాని కలగొద్దన్న లక్ష్యంతోనే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు. అనేక మంది ఇక్కడి శాంతిభద్రతలపై వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో 2016, 2010 నాటి ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు, చిత్రాలను వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. అటువంటి అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తల్ని నియంత్రించడానికి ప్రభుత్వం సైతం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని హెచ్చరించారు. 

కశ్మీర్‌పై కీలక నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల్ని నిలిపివేశారు. ప్రముఖ రాజకీయ, వేర్పాటువాద నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా భారీ ప్రదర్శనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు.

ఈ నేపథ్యంలో ఆంక్షల సడలింపు వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ దశలవారీగా ఆంక్షల్ని సడలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.