అక్టోబరు 12 నుంచి శ్రీనగర్ లో పెట్టుబడిదారుల సదస్సు

ఆర్టికల్జ 370 రద్దుతో జమ్మూ-కశ్మీరులో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి, విశేషంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశలో చకచకా అడుగులు వేస్తున్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయంటూ అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కొద్ది రోజులకే అభివృద్ధి కాంతులను ప్రసరింపజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చర్యలు ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు కల్పించగలవని భావిస్తున్నారు. 

కశ్మీరీల తల రాత మారబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. అక్టోబరు 12 నుంచి 14 వరకు పెట్టుబడిదారుల సదస్సుకు ఆతిథ్యమివ్వబోతున్నట్లు జమ్మూ-కశ్మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ (కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఎన్ కే చౌదరి ప్రకటించారు. 

జమ్మూ-కశ్మీరులో జరిగే మొట్టమొదటి ప్రపంచ స్థాయి సదస్సు ఇదే అవుతుందని చెప్పారు. ఈ సదస్సు ప్రారంభ సమావేశం అక్టోబరు 12న శ్రీనగర్‌లో జరుగుతుందన్నారు. జమ్మూ-కశ్మీరు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యటక రంగం వాటా 15 శాతం. ఈ రంగంలో 50 శాతం ఉద్యోగావకశాలు ఉన్నాయి. పెట్టుబడిదారుల సదస్సులో పర్యటక రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. 

పారిశ్రామికవేత్తలు పర్యాటక రంగంవైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావచ్చు.

అధికరణ 370 రద్దవడంతో పారిశ్రామికవేత్తలు జమ్మూ-కశ్మీరులో పర్యటకం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని అధికారులు ఆశిస్తున్నారు. ప్రకృతి సోయగాల నడుమ ఇళ్ళను నిర్మించుకోవడంపై చాలా మందికి ఆసక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జమ్మూ-కశ్మీరులో రియల్ ఎస్టేట్ ధరలు మిగతా దేశంతో పోల్చినపుడు చాలా తక్కువగా ఉన్నాయి.

మరోవైపు ఇక్కడి సెంటిమెంట్ ఇప్పుడే చల్లారే అవకాశం లేదనేవారు కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధి బాట పట్టేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు మరికొంత సమయం పడుతుందని వీరు చెప్తున్నారు.