జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణపై ఈసీ దృష్టి

జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి సారించింది. నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కసరత్తు చేస్తున్నది. దీని కోసం ఏపీ-తెలంగాణ విభజనతోపాటు గతంలో పలు రాష్ర్టాల విభజన సందర్భంగా అనుసరించిన విధివిధాలను పాటించాలని భావిస్తున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతోపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35 ఏ అధికరణలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీతో కూడిన జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం లో ప్రస్తుతం ఉన్న 107 నియోజకవర్గాలను పునర్విభజన చేసి 114కు పెంచనున్నట్లు జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 60లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ దృష్టి సారించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 31 నుంచి అమలులోకి రానున్న జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణపై కేంద్ర హోంశాఖ నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉన్నదని చెప్పారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ రాష్ర్టాల విభజన సందర్భాల్లో నియోజకవర్గాల విభజనపై అనుసరించిన విధివిధానాలను అధికారులు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు వివరించినట్లు తెలుస్తున్నది.

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే జమ్ము ప్రాంతంలో ఎక్కువ స్థానాలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల అక్కడ పట్టున్న బీజేపీ స్థానిక పార్టీల అండతో లబ్ధి పొందే అవకాశమున్నదని తెలుస్తున్నది.

మరోవైపు, జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చాలా క్లిష్టమైనదని తెలుస్తున్నది. 1992-95 మధ్య ఆ రాష్ట్రంలో చివరిసారి నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. 2002లో ఫరూక్‌ అబ్దుల్లా హయాం లో 2026 వరకు నియోజకవర్గాల విభజన చేపట్టకుండా రాష్ట్ర రాజ్యాంగానికి సవరణ చేశారు. ఈ నేపథ్యంలో 2008లో దేశవ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జమ్ముకశ్మీర్‌ దూరంగా ఉన్నది.