నదుల అనుసంధానంపై కేసీఆర్‌ది యూటర్న్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలతో ఊరించడం, హైటెక్‌ ప్రచారం చేసుకోవడం తప్ప.. రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు ఎకరా పొలంలోనూ ఆ నీళ్లు పారించలేదని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు 115 కిలోమీటర్ల మేర గోదావరి జలాలున్నాయని చెబుతున్నా రైతుల పొలాలకు నీళ్లు అందకపోవడం సీఎం వైఫల్యమని ధ్వజమెత్తారు.

రాజకీయ లబ్ధి కోసమే నదుల అనుసంధానంపై కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఆక్షేపించారు. గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ చిత్తూరు జిల్లా నగరిలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘గోదావరి, కృష్ణా బేసిన్ల నుంచి 100 టీఎంసీల నీటిని రాయలసీమకు ఇవ్వాలని 1998లోనే బిజెపి  నాటి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారు’’ అని ఆక్షేపించారు.

సెప్టెంబరు 17వ తేదీ విమోచన దినోత్సవాన్ని  టిఆర్‌ఎస్ ప్రభుత్వం మతం కోణంలో చూస్తోందని, మజ్లిస్‌ ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ చరిత్రను తెరమరుగు చేస్తోందని మండిపడ్డారు. ఆరోజున అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించి జాతీయ జెండాల్ని బిజెపి ఎగురవేస్తుందని చెప్పారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వస్తారని తెలిపారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే కేసీఆర్‌ సెప్టెంబరు 17న కూడా  సీఎంగా జాతీయజెండా ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు.