రాయలసీమపై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదం

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేసినా తెలంగాణకు నీళ్లు ఇవ్వని సీఎం కేసీఆర్‌ ఏపీలోని రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

ఏ రోటికాడ ఆ పాట పాడటంలో కేసీఆర్‌ సిద్ధహస్తులు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి శాసనసభ ఎన్నికల్లో పబ్బం గడిపేసుకున్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర సెటిలర్లలో  టిఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని లబ్ధి పొందేందుకే తాజాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

నగరిలో స్థానిక ఎమ్మెల్యే రోజా ఆతిథ్యంలో కేసీఆర్‌ గులాబీ రేకులపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. ఆయన గులాబీ రేకులను తొక్కినట్లే రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గులాబీపార్టీని తొక్కిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు ఇప్పటివరకు చేసిన వ్యయం? సాగులోకి వచ్చిన భూమి? ఇంకా ఎన్నిరోజుల్లో పూర్తిచేస్తారు? తదితర ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపై కేసీఆర్‌ దృష్టి పెట్టి ఉంటే దక్షిణ తెలంగాణలో కరవు ఉండేది కాదని తెలిపారు. 

కాగా, నారాయణ్‌ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి బిజెపిలో ఈనెల 18న చేరనున్నారు. పార్టీ లక్ష్మణ్‌తో  హైదరాబాద్‌లో ఆయన సమావేశమయ్యారు.