రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌ సింగ్‌

రాజస్థాన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన సభ్యుడు మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 26న ఎన్నికలు జరుగనున్నాయి.

మూడు దశాబ్దాలుగా అసోం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మన్మోహన్‌సింగ్‌కు.. ఈ దఫా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. 1991 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మన్మోమన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు వరుసగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100 మంది సభ్యుల బలం ఉన్నది. అలాగే 12 మంది స్వతంత్య్ర సభ్యులు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటంతో మన్మోహన్‌సింగ్ గెలుపు నల్లేరుపై నడక కానున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 14గా పేర్కొన్నది. 26వ తేదీన అవసరమైతే ఎన్నిక నిర్వహించి అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేపట్టనున్నారు.