రాజోలు జనసేన ఎమ్యెల్యే అరెస్ట్ .. పవన్ నిరసన

చట్టాన్ని చేతులలోకి తీసుకుని.. మలికిపురం పోలీస్‌ స్టేషను పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడంతో రాజోలు పోలీస్ స్టేషన్ లో జనసేన ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు, తన అనుచరులతో కలసి లొంగి పోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కోర్ట్ లో హాజరు పరచిన పోలీసులకు అరెస్ట్ చేసే విధానం ఇదికాదంటూ న్యాయమూర్తి రేమండ్ విధించడానికి నిరాకరించడంతో చుక్కెదురైనది. దానితో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

ఏలూరు రేంజ్‌ డిఐజి ఎకె.ఖాన్‌ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ నయిమ్‌ అశ్మి రాజోలు నియోజకవర్గానికి పోలీసు బలగాలను మోహరించారు. విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే తన అనుచరులు ఏడుగురితో కలిసి రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో రాజోలు పోలీస్‌ స్టేషన్‌వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అనుచరులు చేరుకున్నారు. రాపాకను కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, అనుచరులు నినాదాలు చేయడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు జనసేన కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి ఎమ్మెల్యే రాపాకను పోలీసులు కోర్టుకు తరలించి హాజరుపరిచారు.

అయితే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసే విధానం ఇది కాదంటూ న్యాయమూర్తి పోలీసుల తీరును తప్పుపట్టినట్టు తెలిసింది. దీంతో పాటు ఎమ్మెల్యేకు రిమాండ్‌ విధించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులే ఎమ్మెల్యే రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు.

తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం స‌బ‌బు కాద‌ని ప్రభుత్వానికి హితవు చెప్పారు. ప్రజలు అడిగితే వారికి మద్దతుగా వరప్రసాద్‌ వెళ్లారని, అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాలో వైసిపి ఎమ్మెల్యే జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. మలికిపురం ఘటనలో గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారని ధ్వజమెత్తారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలనిహెచ్చరించారు.

జనసేన కార్యకర్తలు, నాయకులు సంయమనంతో ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపుతప్పి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో తానే స్వయంగా వస్తానని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షిస్తున్నట్టు పవన్‌ చెప్పారు.