కశ్మీర్‌ లో ఆంక్షలపై జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం

ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో  ప్రభుత్వ యంత్రాంగం విధించిన ఆంక్షల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాకుండా కశ్మీర్‌ విషయంలో రోజువారీ అడ్మినిస్ట్రేటర్‌ పాత్రను పోషించడానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనంవాదనలు స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆంక్షల్ని విధించారని పిటిషనర్‌ తెహసీన్‌ పూనవాల ధర్మాసనానికి తెలిపారు. దీంతో అరుణ్‌ మిశ్రా అక్కడి పరిస్థితుల్ని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.

రోజురోజుకీ అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని.. ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్‌ వివరించారు. క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 2016లో మూడు నెలలు కఠిన ఆంక్షలు విధించారని.. దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని స్పష్టం చేశారు.

మరికొద్ది రోజుల్లో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అటార్నీ జనరల్‌ ధర్మాసనానికి వివరించారు. అక్కడ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లాంటి కనీస వసతులను అందుబాటులో ఉంచామని తెలిపారు. అక్కడి జిల్లాల్లో పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది