సిక్కింలో బీజేపీలో చేరిన 10 మంది ఎమ్యెల్యేలు!

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక్కరోజులోనే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు నేడు ఒకేసారి బిజెపిలో చేరారు. ఈ ఉదయం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 

ఒక్క సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బిజెపి అధికారంలో ఉంది. కొన్నింటిలో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా చేరికలతో సిక్కింలోనూ బిజెపి బలపడినట్లయింది.

సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌) ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పార్టీకి 15 స్థానాలు రాగా.. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అయితే ఎస్‌డీఎఫ్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఇద్దరు చెరో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో ఫలితాల అనంతరం వారు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా ఎస్‌డీఎఫ్‌ సంఖ్యా బలం 13కు పడిపోయింది. ఈ 13 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు నేడు బిజెపిలో చేరారు. 

ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్ చామ్లింగ్‌ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 25ఏళ్లకు పైగా ఆయన సిక్కిం సీఎంగా సేవలందించారు.