ప్రభుత్వానికి గుదిబండగా సీఎం జగన్ విధానాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన దుందుడుకుగా ఉంటుందని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో జగన్‌ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏలూరులో విమర్శించారు. పరిపాలన తొందరపాటు నిర్ణయాలతో సాగుతోందని చెప్పారు.  సీఎం తీసుకొచ్చిన కొన్ని విధానాలు ప్రభుత్వానికి గుదిబండగా తయారయ్యాయని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ఒకరు జైలుకు వెళ్లిన నేత, మరొకరు జైలుకు వెళ్లబోయే నేత అని, అందుకే ఆ పార్టీల నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి కన్నా వెల్లడించారు. 

రాష్ర్టానికి ఆదాయం చేకూర్చే ఇసుక పాలసీని పక్కనపెట్టి, రాష్ర్టానికి గుదిబండలాంటి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇప్పటికిప్పుడే అవసరమా అని ప్రశ్నించారు. సెప్టెంబరు 5న ఇసుక పాలసీని ప్రకటిస్తామని సీఎం జగన్‌ ముహూర్తం పెట్టుకున్నారని.. ఈ లోపులో భవన నిర్మాణ కార్మికులు కడుపుమాడ్చుకోవాలా అని దుయ్యబట్టారు.

ఇసుక విధానం ఖరారుకు సెప్టెంబరు 5న ఎందుకు ముహూర్తం పెట్టారో అర్థం కావడం లేదని అంటూ దీనిపై ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మూడునెలలైనా గడవక ముందే రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ప్రజాదరణ చూరగొనడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.ముంపు ప్రాంతాల్లో పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

370 ఆర్టికల్‌, 35ఎ ఆర్టికల్స్‌ను రద్దు చేసిన తర్వాత మోదీ ఇమేజ్‌ ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని తెలిపారు. గత ఐదేళ్ళలో ప్రధాని మోదీ అవినీతిరహిత పాలనను అందించారని చెబుతూ 2019 ఎన్నికల తర్వాత అన్ని రాష్ర్టాల్లోనూ ఇతర పార్టీ నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని భరోసా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఇప్పటి వరకు 10 నుంచి 12 లక్షల మంది కొత్తవారు బీజేపీలో చేరారని ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.