తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక రచనలో బిజెపి

ఎన్నికల హామీలతో మొక్కుబడిగా కాకుండా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని, పలు రంగాల నిపుణులతో సమాలోచనలు జరిపి, రాష్ట్ర భవిష్యత్ కు దిక్చూచిగా ఉండే విధంగా ‘విజన్ 2038’ పేరుతో ప్రణాళికను రూపొందించే బృహత్తర కసరత్తును రాష్ట్ర బిజెపి శాఖ చేపట్టింది.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు భిన్నమైన విధంగా ప్రజా ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తెలిపారు  తాము అధికారంలోకి వస్తే రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో తన ప్రణాళికలో స్పష్టం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపునకు చూస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని సమాంతరంగా ఈ ప్రణాళికలో చేర్చడానికి కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కర్ణాటక రాష్ట్ర మేనిఫెస్టోను కూడా మోడల్‌గా తీసుకుంటోంది. వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల ప్రణా ళికను రూపొందించడానికి పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన బీజేపీ ఒక కమిటీ వేసింది.

ఈ కమిటీ వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన 80 నిపుణులు హాజరైన ఈ సమావేశంలో తమతమ రంగాలకు చెందిన అన్ని అంశాలను వారు చర్చించారు. ఎన్నికల ప్రణాళికలో ఏఏ అంశాలు చేర్చాలన్న అంశంపై విస్తృతంగా చర్చలు జరిపారు. సామాజిక అంశాలపై వివిధ వర్గాలకు చెందిన నిపుణులు సూచనలిచ్చారు.

వారి సలహాలు, సూచనలపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి విన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, విద్య, ఉద్యోగావకాశాలతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచించారు. ప్రజా సంక్షేమానికి మరింత ప్రాధాన్యమివ్వా లన్న సూచనలు వచ్చాయి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

 ఇప్పుడు రూపొందించబోయే ఎన్నికల ప్రణాళికలో రాబోయే 20 ఏళ్లలో ఎదురయ్యే పరిణామాలు, పరిష్కార మార్గాలను కూడా చేర్చాలని సూచించారు. ‘విజన్ 2038’ లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చారు. 2038 నాటికి సంపూర్ణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా బిజెపి నేతలు భరోసా ఇస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని అంశాలకు ప్రణాళికలో  చోటు కల్పించనున్నారు. వ్యవసాయరంగాన్ని పూర్తి స్తాయిలో ప్రోత్సహించేందుకు చర్యలను పేర్కొనున్నారు.

ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో బీజేపీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను మోడల్‌గా తీసుకుంటున్నారు. రైతులకు రుణమాఫీతో పాటు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు మద్దతు ధరకు అధనంగా బోనస్ ప్రకటన. రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ, ఉపాధి అవకాశాల సృష్టికోసం పరిశ్రమల ఏర్పాటు, మూత పడిన పరిశ్రమలను తెరిపించడం. నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి అన్ని చర్యలను ప్రతిపాదిస్తున్నారు.