ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలి

ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూసిన ఆయన సాహస యాత్ర సోమవారం రాత్రి డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమైంది. దట్టమైన అడవుల్లో ఎలాంటి బెరుకు లేకుండా సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో ఆయన ప్రయాణం సాగించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాలను ప్రకృతితో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ పంచుకున్నారు. 

జిమ్‌కార్బెట్ జాతీయ పార్కులో ఓ పక్క వర్షం, మరోపక్క వెన్నువణికించే చలిగాలులు వీస్తున్నా, అంతా చల్లదనం ఆవరించినా అతడితో కలిసి ముందుకు సాగారు. ఇప్పటి వరకు తాను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబమాతో సహా అనేక మంది అంతర్జాతీయ నాయకులతో ఈ తరహా షో నిర్వహించానని, మోదీతో తనకు ఈ అవకాశం రావడం ఓ గొప్ప వరం అని బేర్ గ్రిల్స్ పేర్కొన్నారు. గ్రిల్స్ అడిగిన అనేక ప్రశ్నలకు మోదీ ఎంతో ఉత్సాహంగా తన సాహస యాత్రను కొనసాగిస్తూనే సమాధానం చెప్పారు. 

మొదటి నుంచీ తాను ప్రకృతి ఆరాధకుడిని అని చెప్పిన మోదీ తాను వన్యప్రాణి సంరక్షణ అవసరాన్ని కూడా గట్టిగా చెప్పారు. పర్యావరణ మార్పులను నిరోధించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రకృతిని ఉల్లంఘిస్తే దాని సమతూకాన్ని దెబ్బతీస్తే ప్రమాదకర పరిణామాలే సంభవిస్తాయని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ప్రకృతితో సహజీవనం చేస్తేనే దాని వల్ల ప్రయోజనం ఉంటుందని, ఎలాంటి భయం, ముప్పురాదని స్పష్టం చేశారు. 

ప్రకృతిని కొల్లగొడితే భావితరాలకు సమాధానం చెప్పలేని పరిస్థితే ప్రతి ఒక్కరికీ తలెత్తుతుందని చెప్పారు. నేటికీ 50 ఏళ్ళ తర్వాత పుట్టే పిల్లలు ‘నాకు స్వచ్చమైన గాలిని లేకుండా ఎందుకు చేశావు’ అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితి వస్తుందన్నారు. తాను శాఖాహారినని, జంతుజాలాన్ని అనుకూలమైన పర్యావరణాన్ని పెంపొదించాల్సిన అవసరమైన ప్రాధాన్యత తనకు తెలుసునని చెప్పారు.

ఈ సందర్భంగా తన బాల్యం గురించి బేర్ గ్రిల్స్‌కు వివరించారు. అలాగే ప్రధాన మంత్రిగా తన లక్ష్యాల గురించి వెల్లడించారు. అసలు తనకు భయం అంటే ఏమిటో తెలియదని, అలాంటిది తన అనుభవంలోకి ఎప్పుడూ రాలేదని మోదీ తెలిపారు. తన సానుకూల దృక్ఫథమే, తన ఆలోచనా రీతే తనకు భయం అంటే ఏమిటో తెలియకుండా చేసిందని చెప్పారు. అందుకు కారణం ప్రతి విషయాన్ని తాను సానుకూలంగా పరిగణించడమే కావచ్చునని వెల్లడించారు. దీని వల్లే తాను ఎప్పుడూ నిరుత్సాహానికి లోనుకాలేదన్నారు. 

ప్రధాన మంత్రి అవుతానని ఎప్పుడైనా ఊహించారా అన్న ప్రశ్నకు దేశాభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పని చేశానని చెప్పారు. ఓ రాష్ట్రానికి 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని, అప్పట్లో తాను కొత్తేనని చెప్పిన మోదీ ఇప్పుడు దేశ ప్రజలు తనకు ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు అప్పగించారని, గత కొనే్నళ్ళుగా నిర్వహిస్తూనే వచ్చానని చెప్పారు. తాను ఏ పదవిలో ఉన్నా అభివృద్ధి కోసమే పని చేశానని వెల్లడించారు. 

ఈ బాధ్యతల నిర్వహణ తనకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నదని చెప్పిన మోదీ తాను వ్యాహ్యాలికి రావడం గత 18 ఏళ్ళలో ఇదే మొదటిసారి అని అన్నారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సాహాస యాత్ర ముగింపు సందర్భంగా ‘నీతో కలిసి ఈ షోలో పాల్గొనడం, ప్రకృతిలో మమేకం కావడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ భారత్ పట్ల ఆసక్తిని కనబరుస్తారు. టూరిజాన్ని పెంపొదించడానికి ఈ షో దోహదం చేస్తుంది..’ అని పేర్కొన్నారు.

 ఈ షో ప్రసారానికి ముందు మట్లాడిన మోదీ భారత దేశ జంతుజాలాన్ని, పచ్చదనాన్ని ప్రపంచ దేశాలకు చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఇందుకు అంగీకరించానని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పేర్కొన్నారు.