సారాభాయ్ దార్శనికతతోనే శాస్త్ర, సాంకేతిక శక్తిగా భారత్

భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలో భారత్ శాస్త్ర, సాంకేతిక శక్తిగా ఎదుగడంలో సారాభాయ్ దార్శనికత ఎంతో దోహదపడిందని కొనియాడారు. సోమవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన సారాభాయ్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ మేరకు ప్రధాని వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. చంద్రుడిపై భారత్ అడుగు పెట్టబోతున్న వేళ డాక్టర్ సారాభాయ్ శతజయంతి వేడుక రావడం విశేషం.

చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ వచ్చే నెల చంద్రుడిపై అడుగుపెడితే.. అదే 130 కోట్ల మంది భారతీయులు డాక్టర్ సారాభాయ్‌కి అందించే ఘన నివాళి అని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర అంతరిక్ష విభాగం, అణుశక్తి విభాగం, ఇస్రో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు అధునాతన సాంకేతికతను వినియోగించేందుకు సంకోచించకూడదని సారాభాయ్ చెబుతుండేవారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగడంలో సారాభాయ్ అవిరళ కృషి చేశారు అని ప్రధాని కొనియాడారు. 

భారత అణు కార్యక్రమానికి బీజం వేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా మరణంతో ఏర్పడిన లోటును డాక్టర్ సారాభాయ్ తీర్చారని చెప్పారు. 1960లలో కేరళలోని తుంబలో సారాభాయ్ సారథ్యంలో ప్రయోగించిన తొలి రాకెట్.. నేడు మార్స్, ల్యూనార్ మిషన్లలో వినియోగిస్తున్న కెట్ టెక్నాలజీకి మూలాధారమని మోదీ తెలిపారు.

మన అంతరిక్ష, అణు కార్యక్రమాలకు సారాభాయ్ కొత్త దారులు చూపారు. నేడు అంతరిక్ష రంగంలో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచం యావత్తూ విస్మయం చెందుతున్నది. విక్రమ్ సారాభాయ్ ప్రసిద్ధ శాస్త్రవేత్త మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది.. గొప్ప ఉపాధ్యాయుడు అని ప్రధాని పేర్కొన్నారు. దేశ యువత సారాభాయ్‌ని స్ఫూర్తిగా తీసుకుని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ కే శివన్, ఆ సంస్థ మాజీ చైర్మన్ కస్తూరిరంగన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ ప్రమోద్ కాలే, సారాభాయ్ కుమారుడు కార్తికేయ సారాభాయ్ తదితరులు పాల్గొన్నారు.

విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఇస్రోకు పునాది వేసింది ఆయనే. 28 ఏండ్ల వయసులోనే అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని నెలకొల్పారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గానూ ఆయన వ్యవహరించారు. అహ్మదాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను (ఐఐఎంను) ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. 

ఫాస్టర్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (ఎఫ్‌బీటీఆర్), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ ప్రాజెక్ట్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వంటి సంస్థలను స్థాపించారు. 1971 డిసెంబర్ 30న కన్నుమూశారు.