సుస్థిరతకు భారత్‌-చైనా బంధం బాటలు వేయాలి

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్‌-చైనా బంధం ప్రపంచ సుస్థిరతకు బాటలు వేసే దిశగా సాగాలని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్‌ ఆకాంక్షించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనాలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం చైనాకు చేరుకున్న జైశంకర్‌ సోమవారం తొలుత ఆ దేశ ఉపాధ్యక్షుడు వాంగ్‌ ఖిషాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య బంధం సుస్థిరత వైపు అడుగులు వేయాలని ఉభయ దేశాధినేతలు గతంలో జరిగిన భేటీ సందర్భంగా నిర్ణయించారన్నారు. ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధికరణ 370 రద్దుతో సరిహద్దులో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. అలాగే ఇరు దేశాల మధ్య నెలకొన్న కొన్ని సున్నితమైన సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. 

జమ్ముకశ్మీర్‌ అంశం పూర్తిగా అంతర్గత విషయమని ఈ సందర్భంగా చైనాకు భారత్‌ తెలియజేసింది. దీనిపై వాంగ్‌ యీ స్పందిస్తూ భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఆందోళనక పరిస్థితులను చాలా దగ్గరగా గమనిస్తున్నామని తెలిపారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత నెలకొల్పడంతో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ అంశంలో ఐరాసలో చైనా తమకు మద్దతు తెలపనుందని ఇప్పటికే పాక్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

మూడు రోజుల పర్యటనలో భాగంగా.. జైశంకర్‌ ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గతేడాది ఇరు దేశాధినేతల మధ్య జరిగిన భేటీ సందర్భంగా కుదిరిన ఒప్పందాలకు తుది రూపునివ్వనున్నారు. మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ కేంద్ర మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.