బిజెపిలోకి ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌

దేశ రాజకీయాల్లోకి మరో క్రీడాకారిణి అడుగుపెట్టారు. ప్రముఖ రెజ్లర్‌, ఫొగట్‌ సోదరీమణుల్లో ఒకరైన బబితా ఫొగట్‌ నేడు భారతీయ జనతా పార్టీ చేరారు. దిల్లీలోని హరియాణా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో బబిత, ఆమె తండ్రి మహవీర్‌ సింగ్‌ ఫొగట్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.  

అంతకుముందు మహవీర్‌ పొగట్‌ మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను రద్దు చేసి బిజెపి ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది. మనోహర్‌లాల్‌ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తోంది. ఈ రోజు నేను, బబిత దిల్లీకి వెళ్తున్నాం’ అని  మీడియాకు తెలిపారు.  ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరుణాన్ని చూసే అదృష్టం నాకు లేకపోయింది. కానీ, ఆర్టికల్‌ 370, 35ఏల రద్దుతో కశ్మీర్‌ స్వాతంత్ర్యం పొందడాన్ని చూసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని బబిత ట్వీట్‌ చేశారు.

బబిత హరియాణా పోలీసు విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఫొగట్‌ కుటుంబం తెలిపింది. ఇటీవల కశ్మీరీ యువతులపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలను బబిత సమర్థించారు. ఆయన అన్నదాంట్లో ఎలాంటి వివాదం లేదని, సీఎం వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ మీడియాకు సూచనలు చేశారు.  ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్‌ బీజేపీ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.