పోలవరాని అల్లూరి పేరు పెట్టాలి

పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు, రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పేరు పెట్టాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏం సంబంధమని ఆయన  ప్రశ్నించారు. చంద్రబాబుకు కొంచమైనా పరిజ్ఞానం ఉంటే పోలవరం ప్రాజెక్టు ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఫోటోలు పెట్టేవాడని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు దగ్గర సీఎం చంద్రబాబు చేసినన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా చేసి ఉండరని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ప్రధాని మోదీని ఆడిపోసుకోనిదే చంద్రబాబుకు పొద్దు గడవదని ఎద్దేవాచేశారు.

ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వీర్రాజు స్పష్టం చేసారు.  కాకినాడలో కేంద్రం ప్రతిపాదించిన హర్డ్‌ వేర్‌ పార్క్‌కి చంద్రబాబు స్థలం చూపించలేకపోయాడని ఆరోపించారు.నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో బాబు చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు సర్కార్‌ అధిక పన్నులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. మూడు రూపాయలు విలువ చేసే ఛీఫ్‌ లిక్కర్‌ను బాబు సర్కార్‌ రూ.50కి అమ్ముతుందని ఆరోపించారు.

పెట్రోపై పక్క రాష్ట్రాల కంటే రూ.6 ఎక్కువ పన్ను వసూలు చేస్తున్న చంద్రబాబు.. రూ.2 తగ్గించి తానేదో త్యాగాలు చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై ఆరు రూపాయలను తగ్గించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అమలులో ఉన్న 100కు పైగా పథకాలు కేంద్రం ఆర్థిక సాయంతోనే నడుస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు.