ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి తెర

జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడం వల్ల త్వరలోనే ఉగ్రవాదానికి తెరపడుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ఉప రాష్టప్రతిగా వెంకయ్య నాయుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘లిజనింగ్, లర్నింగ్ అండ్ లీడింగ్’ పుస్తకాన్ని ఆయన ఆదివారం చెన్నై జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం దేశానికి ఎంతో లాభదాయకమని తెలిపారు. 

ఈ చర్యవల్ల, అక్కడ ఉగ్రవాదానికి తెరదించేందుకు అవసరమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. అంతేగాక, వేగవంతమైన అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని షా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్రం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ఆర్టిల్ 370ని రద్దు చేసి, స్థానిక ప్రజలకు నిజమైన స్వేచ్ఛను కల్పించిందని తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నెలకొన్న పరిస్థితే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కనిపించిందని చెప్పారు. అయితే, రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు ఎంతో సమర్థంగా సభు నడిపించారని ప్రశంసించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తనకు ఎంతో స్పష్టత ఉందని చెబుతూ అటు దేశానికిగానీ, ఇటు కాశ్మీర్‌కుగానీ ఏ మాత్రం ఉపయోగపడని ఈ అధికరణను సాధ్యమైనంత త్వరగా రద్దు చేయాలన్నని అనుకున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు మరో ఆలోచన లేదన్నారు. 

జమ్మూకాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకళించడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా జరగని అభివృద్ధి ఇక ముందు చూడగలుగుతామని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై సంపూర్ణ చర్చ అవసరమని భావించామని, అందుకే, ముందుగా దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టామని చెప్పారు. అక్కడ సుదీర్ఘమైన చర్చన అనంతరం బిల్లుకు ఆమోద ముద్ర పడిందని, ఆతర్వాత లోక్‌సభ కూడా ఆమోదించిందని షా వివరించారు. 

కాగా, తాను దేశం మొత్తానికి ఉప రాష్టప్రతినని, అందుకే, ఢిల్లీకి మాత్రమే పరిమితం కాబోనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఉప రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దేశ వ్యాప్తంగా సుమారు 330 సమావేశాల్లో పాల్గొన్నారు. సాంస్కృతికి వారసత్వ సంపదకు తమిళనాడు నిలయమని, అందుకే, ఈ కార్యక్రమానికి చెన్నైని వేదికగా ఎంచుకున్నానని వెంకయ్య తెలిపారు. 

ఏ భాషనూ, ఎవరూ వ్యతిరేకించకూడదని అంటూనే, బలవంతంగా భాషలను రుద్దడం సమంజసం అనిపించుకోదని స్పష్టం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తర్వాత దేశ ఉప రాష్టప్రతిగా ఎదిగానని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పారు.