జమ్మూ కాశ్మీర్ లో ఆస్తుల కొనుగోలుపై ఆంక్షలు

ఆర్టికల్ 370 రద్దు కావడంతో దేశంలో ఎవరైనా జమ్మూ కాశ్మీర్ కువెళ్లి అక్కడ భూములు కొనుగోలు చేయవచ్చని,  ఆస్తులు సమకూర్చువుకోవచ్చని, భారీ ఎత్తున తమ వ్యాపారాలు ప్రారంభించ వచ్చని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తున్నది. ఈ ఆర్టికల్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల ఉద్దేశ్యం కూడా అది కాదని చెబుతున్నారు. స్థానిక ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం కొన్ని ఆంక్షలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదంపై అవకాశం  లేకుండా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో ముందుండే విధంగా చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్దపడుతున్నారు. 

ఆర్టికల్–370’తోపాటు ‘ఆర్టికల్–35ఏ’ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చి వేయడంతో అక్కడికి ఎవరైనా వెళ్లిపోయి, ఎన్ని ఎకరాల భూమినైనా కొనుకోవచ్చని అనుకుంటున్నారు.  అయితే ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించాలని స్థానిక బీజేపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. 

స్థానికుల హక్కులను (ముఖ్యంగా భూములు, ఉద్యోగాలకు సంబంధించినవి) కాపాడటానికి డొమిసైల్ బేస్డ్ పాలసీని (నివాస ప్రాతిపదికన రూపొందించే విధానాన్ని) అమలుచేయాలని బీజేపీ భావిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ తెలిపారు. 

‘హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఇతర రాస్త్రాల వారు తమకు ఇష్టమొచ్చినంత భూమిని కొనే అవకాశం లేదు. ఇదే మాదిరిగా జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాట్లు చేయాలని కేంద్రంలోని మా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కాశ్మీర్‌లోని కాశ్మీరీల, వాల్మీకీల, గుజ్రాల, బకర్వాలాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది' అని ఆయన స్పష్టం చేశారు. 

ఈ విషయంలో స్థానిక ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురిచేసే ప్రచారాన్ని ఇప్పటికైనా కట్టడి చేయాలని నిర్మల్ సింగ్ మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పలు ఈశాన్య రాష్ట్రాలలో సహితం ఈ విధాయమైన పరిమితులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బయటి రాష్ట్రాల వాళ్లు హిమాచల్‌ప్రదేశ్‌లో సాగు భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కొనటానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాల జనాలు ఉత్తరాఖండ్‌లో 250 చదరపు మీటర్లకు మించి భూమిని కొనే అవకాశం లేదు.