శ్రీరాముడి వంశంలో జన్మించానంటున్న బీజేపీ ఎంపీ

రాజస్థాన్‌లోని జైపూర్ రాజ వంశీకురాలు, బీజేపీ ఎంపీ దియా కుమారి ఓ ట్వీట్‌లో ఆసక్తికర విషయం వెల్లడించారు. తమ కుటుంబం అయోధ్య శ్రీరాముడి వంశం నుంచి వచ్చిందని పేర్కొన్నారు. తాము శ్రీరాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందినవారమని తెలిపారు.

అయోధ్య రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరుపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణ సందర్భంగా రామ్ లల్లా విరాజ్‌మాన్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ పరాశరన్‌ను ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. అయోధ్యలో శ్రీరాముడి వంశానికి చెందినవారు ఇప్పటికీ ఎవరైనా నివసిస్తున్నారా? అని అడిగారు.

ఈ నేపథ్యంలో దియా కుమారి ట్విటర్ వేదికగా తన పూర్వీకుల గురించి తెలిపారు. ‘‘ఔను, శ్రీరాముడి వారసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన కుమారుడు కుశుడి వంశానికి చెందిన మా కుటుంబంతో సహా’’ అని ట్వీట్ చేశారు.

దియా కుమారి రాజస్థాన్‌లోని రాజసమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచారు. తాము శ్రీరాముడి వంశస్థులమని చెప్పడం వెనుక తనకు ఎటువంటి ఉద్దేశం లేదని దియా స్పష్టం చేశారు. అయోధ్య వివాద స్థలంపై తమకు ఎటువంటి హక్కు, ఆపేక్ష లేవని తెలిపారు. న్యాయ ప్రక్రియలో భాగం కావాలని కోరుకోవడం లేదన్నారు. ఎటువంటి ఉద్దేశం లేకుండా తన మనసులో మాటను చెప్పానన్నారు.

జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ మ్యూజియం ప్రత్యేక అధికారి రాము రాందేవ్ మాట్లాడుతూ ప్రస్తుత జైపూర్ రాజు (బిరుదు) పద్మనాభ్ సింగ్ శ్రీరాముడి కుమారుడు కుశుడి 309వ తరానికి చెందినవారని తెలిపారు.

చరిత్రకారుల కథనం ప్రకారం జైపూర్ పాలకులు రాజ్‌పుట్‌లలో కచ్‌వాహ గోత్రానికి చెందినవారు. జైపూర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, సంస్కృతి డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ ఆర్ నాథ్ రాసిన పుస్తకంలో అయోధ్యలోని రామ జన్మస్థానం దేవాలయం ఉన్నటువంటి జైసింగ్‌పురపై యాజమాన్యం శాశ్వతంగా కచ్‌వాహాలదేనని నిర్ద్వంద్వంగా చెప్పగలిగే సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

దీనికి సంబంధించిన పట్టాలు, పర్వానాలు, చక్‌నామాలు, లేఖలు, ఇతర పత్రాలు, మ్యాపులు, ప్లాన్లు సిటీ ప్యాలెస్ మ్యూజియంలో ఉన్నాయని పేర్కొన్నారు. అయోధ్యకు, రామాలయానికి సంబంధించిన అత్యంత ప్రాచీన మ్యాపును ఆదివారం మీడియాకు ప్రదర్శించారు. కచ్‌వాహాల వంశ క్రమానికి సంబంధించిన రికార్డులను కూడా విలేకర్లు చూడటానికి అందుబాటులో ఉంచారు.