మోదీ-షా కృష్ణార్జునులు... రజనీకాంత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ద్వయంపై సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ ప్రశంసల వర్షం కురిపించారు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ర్టాన్ని రెండుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై  హర్షం వ్యక్తం చేశారు. 

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కృష్ణార్జునులుగా పోల్చారు. అయితే ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు అనేది మాత్రం తెలియదన్నారు.

‘మిషన్‌ కశ్మీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతం. అమిత్‌ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌లాంటి వారు. ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి’ అని తెలిపారు. 

వెంకయ్య గురించి మాట్లాడుతూ..‘ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనోగొప్ప ఆధ్యాత్మిక వేత్త’ అని కొనియాడారు.