59 పరుగుల తేడాతో భారత్‌ విజయం

బ్యాట్‌తో సారథి కోహ్లీ(120; 125బంతుల్లో 14×4, 1×6), బంతితో భువనేశ్వర్‌ కుమార్‌(4/31) చెలరేగిన వేళ.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. 

ఓపెనర్‌ లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్‌(2/59) ఆకట్టుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. 

యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(71; 68బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.  

 ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌(11; 24బంతుల్లో 1×4) ఈ మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడలేకపోయాడు. భారత బౌలర్లను ఎదుర్కొలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. విండీస్‌ స్కోరుబోర్డు రెండొదలు దాటిందంటే అదంతా లూయిస్‌-పూరన్‌ వల్లే. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్‌ నిలబెట్టారు. 

ఆచితూచి ఆడిన లూయిస్‌ 23వ ఓవర్‌లో అర్ధశతకం అందుకున్నాడు. కానీ మరో 15 పరుగులు జోడించి కుల్దీప్‌ బౌలింగ్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. తర్వాత పూరన్‌(42), ఛేజ్‌(18)తో పోరాడే ప్రయత్నం చేశాడు. కుదురుకుంటున్న ఈ జోడీని భువనేశ్వర్‌ 35వ ఓవర్‌లో విడదీశాడు. ఇద్దరినీ వెంటవెంటనే పెవిలియన్‌కు పంపి విండీస్‌ కష్టాలను రెట్టింపు చేశాడు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు ధావన్‌, రోహిత్‌ ఆశించిన ఆరంభాన్నివ్వలేదు. కాట్రెల్‌ వేసిన తొలి ఓవర్లోనే భారత్‌కు షాక్‌ తగిలింది. మూడో బంతికి ధావన్‌ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకపోయినా విండీస్‌ సమీక్షలో ఈ వికెట్‌ సాధించింది. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన విరాట్‌.. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. రోచ్‌ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అతను జోరు కొనసాగించాడు. 

అయితే మరో ఓపెనర్‌ రోహిత్‌ మాత్రం క్రీజులో బాగా ఇబ్బంది పడ్డాడు. మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 55 కాగా.. అందులో కోహ్లి స్కోరే 38. రోహిత్‌ అప్పటికి 20 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఆ తర్వాత కూడా విరాటే స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 

16వ ఓవర్‌ వరకు క్రీజులో ఉండి 18 పరుగులే చేసిన రోహిత్‌.. చేజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి పూరన్‌కు దొరికిపోయాడు. నాలుగో స్థానంలో వచ్చిన రిషబ్‌ పంత్‌ (20) నిలదొక్కుకుంటున్న సమయంలో బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.