పాకిస్థానీ నోరుమూయించిన ప్రియాంక

 

స్టేజ్‌పై అందరి ముందు తనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఓ పాకిస్థానీ మహిళ నోరుమూయించారు గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా . లాస్‌ఏంజెల్స్‌లో బ్యూటీకాన్‌ పేరిట శనివారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా అతిథిగా విచ్చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థానీ యువతి ప్రియాంకతో దురుసుగా ప్రవర్తించారు.

‘భారత బలగాలు పాకిస్థాన్‌లో ఎయిర్‌ స్ట్రయిక్స్‌ చేసినప్పుడు మీరు ‘జై హింద్‌’ అని ట్వీట్‌ చేశారు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ అయివుండి అలా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయొచ్చా?ఓ పాకిస్థానీ మహిళగా నేను, నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాక్‌పై యుద్ధానికి దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?’ అంటూ కేకలు వేశారు. 

ఇందుకు ప్రియాంక స్పందిస్తూ.. ‘నాకు పాకిస్థాన్‌లో ఎందరో స్నేహితులు ఉన్నారు. కానీ నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు బాధ్యత, గౌరవం ఉన్నాయి. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావ్‌. నేను కూడా అంతే. ఇలా అరవకు. అరిచి నీ పరువు తీసుకోకు' అంటూ సున్నితంగా మందలించారు.

`ఇక్కడ మనమంతా ప్రేమగా వ్యవహరించాలి. ప్రపంచంలోని సగం జనాభాలో మనమున్నాం. అన్ని రంగాల్లో మనం రాణించాలి. మహిళలు ఒకనినొకరు ప్రోత్సహించుకుంటూ సాయం చేసుకోవాలి. నేనున్న స్థాయిలో ఇతర మహిళలను ప్రోత్సహించి వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని ఎన్నో ఏళ్ల క్రితమే నాకు నేను మాటిచ్చుకున్నాను.’ అని చెప్పి సదరు యువతి నోరుమూయించారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.