జవహర్‌లాల్ నెహ్రూ నేరస్థుడు

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఓ నేరస్థుడు అంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి ఉపాధ్యక్షుడు  శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆరోపణ చేశారు. అప్పట్లో కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించకుండా ఉంటే కశ్మీర్ మొత్తం మనదే అయ్యేదని పేర్కొన్నారు. 370 అధికరణను తీసుకురావడం, పాకిస్థాన్‌తో యుద్ధం జరుపుతుంటే భారత బలగాలను వెనక్కి రప్పించడం ద్వారా ఆయన నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. 

'నెహ్రూ ఓ క్రిమినల్. కశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను భారత బలగాలను తరిమివేస్తుండగా హఠాత్తుగా కాల్పుల విరమణను ఆయన ప్రకటించారు. అప్పటికే కశ్మీర్‌లో మూడింట ఒక వంతు భూభాగాన్ని పాక్ ఆక్రమించింది. మరికొద్ది రోజులు కాల్పులు జరిపి ఉంటే యవత్ కశ్మీరం మనదై ఉండేది' అని ఓ ట్వీట్‌లో చౌహాన్ విరుచుకుపడ్డారు. 

370 అధికరణతో మరో నేరానికి నెహ్రూ పాల్పడ్డారనిధ్వజమెత్తారు. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు అనే విధానం ఎంతమాత్రం సరైనది కాదని, దేశం పట్ల నేరమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను ఇటీవల పార్లమెంటు రద్దు చేయడంతో పాటు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 

దీంతో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ అవతరించబోతున్నాయి. సమీప భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు.