తెలంగాణ ఎన్నికలు ఫెబ్రవరి లోనే !

అర్ధంతరంగా అసెంబ్లీ ని రద్దు చేసి, నవంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని ఒక వంక ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించగా, మరోవంక అందుకు గల అవకాశాలను పరిశీలించడం కోసం ఎన్నికల కమీషన్ ప్రతినిధి వర్గం రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్ కు చేరుకొని తీరిక లేకుండా సమాలోచనలు జరుపుతున్నది. అదే సమయంలో ఏర్పాట్లు `సంతృప్తి’గా ఉంటేనే నాలుగు రాస్త్రాలతో పాటు తెలంగాణకు కుడా ఎన్నికలు జరుపుతామని, లేని పక్షంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫెబ్రవరిలో జరుపుతామని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ ఢిల్లీలో పేర్కొనడం సంచలనం కలిగిస్తున్నది.

అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల లోగా ఎన్నికలు జరపాలని సుప్రేం కోర్ట్ ఒక కేసు సందర్భంగా సూచించడం మినహా, ఆ విధంగా చట్టంలో ఎక్కడ కాల వ్యవధి లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం ఆసక్తి కలిగిస్తున్నది. అయినా ఆరు నెలలు పూర్తి కావడానికి మార్చ్ 5 వరకు వ్యవధి ఉండడంతో అంత తొందర ఎందుకులే అన్నట్లు మాట్లాడారు. ఏది ఏమైనా ఇప్పుడే ఏ విషయం చెప్పలేనని అన్నారు.

తెలంగాణలో ఎన్నికలు జరపడానికి సన్నాహాలు సంతృప్తికరంగా లేని పక్షంలో హడావుడిగా ఎన్నికలు జరిపి సాహసం చేయబోమని రావత్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినప్పటి నుండి తాము ఎన్నికలు జరిపే పక్రియను ప్రారంభించామని అంటూ ఈ సందర్భంగా రాస్త్ర ఎన్నికల కమీషనర్ ను అడిగితే తాము ఎన్నికలు జరపడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారని తెలిపారు. అయితే తాము ప్రతి విషయాన్నీ పలు వైపులా నుండి సరి చుసుకొంటామని, అందుకే ఒక ప్రతినిధి వర్గాన్ని పంపామని గుర్తు చేసారు. పైగా ఈ సందర్భంగా తమకు వచ్చిన పలు ఫిర్యాదులను సహితం పరిశీలించవలసి ఉన్నదని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమీషన్ రంజిత్ కుమార్ సోమవారం ఢిల్లీ వెళ్లి ప్రధాన కమీషనర్ ను కలవగా హైదరాబాద్ శివారులలో భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించిన్నట్లు వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. కాగా, ఎన్నికలు నవంబర్ లోనే జరుగుతయని కెసిఆర్ చేసిన ప్రకటన పట్ల ఇప్పటికే రావత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే పూర్తి అధికారం కమీషన్ కే ఉన్నదని స్పష్టం చేస్తూ, మరెవరికి అటువంటి అధికారం లేదని అంటూ ఆగ్రహం కుడా వ్యక్తం చేసారు.