కోలుకొంటున్న జమ్మూ-కాశ్మీర్

గత కొన్ని రోజులుగా ఆంక్షల మధ్యే సాగుతున్న జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు శనివారం కొంత ఊరట లభించింది. ఐదు జిల్లాల పరిథిలో ఆంక్షలను అధికారులు ఎత్తివేశారు. దోడ, కిష్టావర్ జిల్లాల్లో ఆంక్షలను సడలించారు. దాంతో ఒక్కసారిగా సాధారణ కార్యకలాపాలు సాగించేందుకు ప్రజలకు అవకాశం కలిగింది. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 

అలాగే స్కూళ్ళు, కాలేజీలు కూడా తెరవాలన్న ఆదేశాలను ప్రభుత్వం వెలువరించింది. జమ్మూ పరిథిలోని ఐదు జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలు శనివారం పని చేశాయని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సిబ్బంది హాజరి పెరిగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. జమ్మూ, కటువా, సాంబ, ఉద్దంపూర్, రియాసీ జిల్లాల్లో అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేశామని, అన్ని విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయని తెలిపారు. 

ఈ నెల 5న ఆంక్షలు విధించినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. అన్ని మార్కెట్లను తెరిచామని, దుకాణాలు కూడా తెరుచుకున్నాయని, ట్రాఫిక్ మాములు స్థాయికి చేరుకున్నదని వెల్లడించారు. శుక్రవారం ప్రార్థనలు కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతంగానే జరిగాయన్నారు. అయితే పూంచ్, రజోరి, రాంబన్ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

మరోవంక, కరాచీ చేరుకోవాల్సిన థార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించింది. దీంతో జోధ్‌పూర్ నుంచి కరాచీకి 165 మంది ప్రయాణికులు ఉన్న థార్ ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియరైంది. జమ్మూ-కాశ్మీర్‌ను, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెంటు ఆమోదించిన జమ్మూ-కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో పాక్ ప్రభుత్వం రైల్వే సర్వీసులను నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా జోద్‌పూర్ నుంచి కరాచీ చేరుకోవాల్సిన థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇదే చివరి రైలు సర్వీసు అని ఆయన చెప్పారు. థార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 165 మంది ప్రయాణికుల్లో 81 మంది భారతీయులు ఉన్నారు. 84 మంది పాక్ దేశీయులు తమ వీసా గడువు ముగిసినందున వెనుదిరిగారు.