జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులకు సీఐఐ హామీ

జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టే అంశంలో తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హామీ ఇచ్చింది. సమాఖ్య అధ్యక్షుడు, కొటక్ మహింద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్‌ కొటక్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వాటికి సీఐఐ పూర్తి మద్దతిస్తుంది. దేశం వేగంగా వృద్ధి చెందాలని ఆశిస్తున్నాం’ అని ఉదయ్‌ కొటక్‌ తెలిపారు. ఎఫ్‌పీఐల గురించి ప్రశ్నించగా.. ఆ అంశం సమావేశంలో చర్చకు రాలేదన్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారని ఉదయ్‌ చెప్పారు. 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి రాష్ట్రానికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలను ఆకర్షించి కశ్మీర్‌లో పెట్టుబడులు పెంచాలని కేంద్రం భావిస్తోంది. పరిశ్రమల సమాఖ్యతో నేడు జరిగిన సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించగా.. అందుకు సీఐఐ మద్దతు పలికింది.