ప్రధాని మోదీ హుషారు చూసి ఆశ్చర్యం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ టెలివిజన్‌ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ ఈ నెల 12న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్‌ మీడియాతో మాట్లాడారు.

‘ ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే ఆయన నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకుడి మాదిరిగా నాతో పాటు అడవిలో కలియతిరిగారు. ఆయన అంత హుషారుగా, సౌకర్యంగా, నిశ్శబ్దంగా ఉండటం చూసి నాకే ఆశ్చర్యమేసింది' అని తెలిపారు. 

`ఈ షోలో భాగంగా మేం కొన్ని రాళ్లను నిజంగానే పగలగొట్టాం. మా బృందం మొత్తం అక్కడ ఉండటానికి భయపడుతుంటే మోదీ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఎలాంటి సంక్షోభాన్నైనా తట్టుకోగలరని నాకు అప్పుడే అర్థమైంది’ అని చెప్పారు. 

వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో దీన్ని షూటింగ్‌ జరిగింది.ఈ కార్యక్రమం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై ప్రసారం కానుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధిన ప్రోమోను బేర్‌ గ్రిల్‌ గత నెలలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి మంచి స్పందన లభించింది.