ఇక వెంటనే వడ్డీరేట్లు తగ్గుతాయి!

ఇటీవల ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో రెపోరేటు తగ్గించిన గంటల వ్యవధిలోనే ఎస్‌బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గించినట్లు ప్రకటన జారీ చేసింది. భవిష్యత్తులో ఆర్‌బీఐ వడ్డీరేట్లు మార్చిన తక్షణమే ఆ ప్రతిఫలాలు ప్రభుత్వ రంగబ్యాంకుల లబ్ధిదారులకు చేరనున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు శుక్రవారం తమ రుణ వడ్డీరేట్లను ఆర్‌బీఐ రెపోరేటుతో స్వచ్ఛందంగా అనుసంధానించేందుకు అంగీకరించాయి.

 ఈ చర్య బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లను నేరుగా ప్రభావితం చేస్తాయి. దీంతో బ్యాంకుల లాభదాయకత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ 40 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను తగ్గించింది. ఫలితంగా గృహరుణాలు, వాహన రుణాలు కారు చౌకగా లభించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కూడా బ్యాంకులు రుణరేట్ల తగ్గింపు ఫలాలను వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేయాలని కోరారు.

 ఆర్‌బీఐ వరుసగా ఇప్పటి వరకు 75బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గిస్తే అన్ని బ్యాంకులు సగటున వినియోగదారులకు 29 బేసిస్‌ పాయింట్లు మాత్రమే తగ్గించాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే సెంట్రల్‌ బ్యాంక్‌, ముంబయి కేంద్రంగా పనిచేసే యూనియన్‌ బ్యాంక్‌, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఆంధ్రాబ్యాంక్‌ త్వరలోనే తమ రుణ వడ్డీరేట్లను నేరుగా రెపోరేటుతో అనుసంధానిస్తామని పేర్కొన్నాయి. ఇది బ్యాంకుల లాభాదాయకతను కొంత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోపక్క అలహాబాద్‌ బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాల వడ్డీరేట్లను పూర్తిగా బెంచ్‌మార్క్‌ రేట్లతో అనుసంధానించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు సీఈవో ఎస్‌.ఎస్‌. మల్లికార్జునరావు పేర్కొన్నారు. 

ఆంధ్రా బ్యాంక్‌

అన్ని కాలావధి రుణాలపై వడ్డీరేటును 0.25 శాతం తగ్గించింది. ఈనెల 16 నుంచి కొత్తరేట్లు అమల్లోకి వస్తాయి. ఏడాది కాలావధి రుణంపై 8.45 శాతం వడ్డీనే పడుతుంది.

కెనరా బ్యాంక్‌

వడ్డీరేటును 0.10 శాతం తగ్గించింది. ఈనెల 7 నుంచి కొత్తరేటు అమలవుతుంది. ఏడాది రుణాలపై వడ్డీ 8.50 శాతమే అవుతుంది.

సిండికేట్‌ బ్యాంక్‌

వడ్డీరేటు 0.25 శాతం తగ్గిస్తున్నామని, ఈనెల 12 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం కానుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

నేటి (ఈనెల 10 )నుంచి వడ్డీరేటు 0.25 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా ఏడాది కాలావధి రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం కానుంది.

అలహాబాద్‌ బ్యాంక్‌

ఈనెల 14 నుంచి అన్ని కాలావధి రుణాలపై వడ్డీరేట్లను 0.15-0.20 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.55 శాతం కానుంది.

ఇండియన్‌ఓవర్‌సీస్‌ బ్యాంక్‌

ఏడాది అంతకుమించిన కాలావధి రుణాలపై 0.15 శాతం, ఏడాదిలోపు రుణాలపై 0.10 శాతం వడ్డీరేటును ఈనెల 10 నుంచి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

యూనియన్‌ బ్యాంక్

వడ్డీరేటును ఈనెల 1 నుంచి 5-20 బేసిస్‌ పాయింట్లు తగ్గించగా, మరో 15 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించే వీలున్నట్లు ప్రకటించింది.