టీఆర్ఎస్ అభ్యర్థి సుమన్‌కు గ్రామస్తుల షాక్

తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన ప్రస్తుత ఎంపి బాల్క సుమన్‌ కు ఇందారం గ్రామంలో ప్రచారానికి వెళ్ళగా గ్రామస్తులు షాక్ ఇచ్చారు. తమ ఊరిలో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేయోద్దంటూ టీఆర్ఎస్ అభ్యర్థి సుమన్ కాన్వాయ్‌ను మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామస్తులు అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్రామస్తులు సుమన్ కాన్వాయ్‌ను అడ్డుకోడంతో పోలీసులు ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. దీంతో గట్టయ్య అనే యువకుడు తన వంటిపై పెట్రోల్ జల్లుకుని నిప్పంటించుకున్నాడు. సుమన్‌పై కూడా జల్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన తప్పించుకున్నారు.

ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయనను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు యత్నించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఈ ఘటనలో గాయాలపాలయ్యారు. చివరికి పోలీసులు మంటలు ఆర్పి గంటయ్యను ఆస్పత్రికి తరలించారు.

 చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంపై నల్లాల ఓదేలు వర్గానికి చెందిన వారు కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన తన కుటుంభ సభ్యులతో  స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గం బాల్క సుమన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.

ఈ ఘటనను పూర్తిగా ఖండిస్తూ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గ టికెట్‌ను కేసీఆర్‌ తనకు కేటాయించారని,  ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని హెచ్చరించారు. ఇది కేసీఆర్‌ నిర్ణయమని, ఆయన శిష్యుడిగా ఆ నిర్ణయాన్ని పాటించడమే తన విధి అని బాల్క సుమన్‌ తేల్చిచెప్పారు.