రాజకీయ కారణాలతోనే ఏపీ, తెలంగాణల్లో సీట్ల పెంపు

అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై ఏపీ, జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాల పునర్విభజన చట్టాల్లో పెట్టిన నిబంధనలను రెండూ ఒక్కటిగా చూడలేమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణల్లో సీట్ల పెంపు అంశం రాజకీయ కారణాలతో ముడిపడిందని, జమ్మూ-కశ్మీర్‌లో మాత్రం అది పీఓకేతోపాటు, పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిందని పేర్కొన్నారు. దీనిపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

తెలంగాణలో హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవమైన సెప్టెంబరు 17ను పెద్దఎత్తున బిజెపి తరపున చేపడతామని  వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ-కశ్మీర్‌ విభజనను వ్యతిరేకించే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసి అరెస్ట్‌ చేయడానికే ముందుగా ఎన్‌ఐఏ, యూఏపీఏ చట్ట సవరణ బిల్లులను తీసుకొచ్చామన్న వాదనల్లో నిజంలేదని త్రోసి పుచ్చారు. 

పుల్వామా దాడికి కారకుడైన పాకిస్థాన్‌ ఉగ్రవాది హఫీద్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితితోపాటు, అమెరికా, చైనాలను మనం డిమాండ్‌ చేసినా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే చట్టం ఇప్పటివరకూ మనదగ్గరే లేదని గుర్తు చేశారు. అది సమంజసం కాదన్న ఉద్దేశంతోనే యూఏపీఏలో సవరణలు తీసుకొచ్చామని తెలిపారు. 

పార్లమెంటులో జమ్మూ-కశ్మీర్‌ బిల్లు పాస్‌ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని, అన్నివర్గాల ప్రజలు తమ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విభజన బిల్లును వ్యతిరేకించినా పార్లమెంటులో పాస్‌ చేశారంటూ లోక్‌సభలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. అసెంబ్లీలు కాదన్నా బిల్లులు పాస్‌చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పడానికే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. 

అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ అయినా ఉంది, ఇప్పుడు కశ్మీర్‌లో అదికూడా లేదని, పూర్తిగా రాష్ట్రపతి పాలనలో ఉండటంతో దాని అధికారాలన్నీ పార్లమెంటుకు వచ్చాయని వివరించారు. అందుకే 370 రద్దు, ఆ రాష్ట్ర విభజనపై పార్లమెంటు నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

అక్కడి ప్రజల మనోభావాలను 70 ఏళ్ల నుంచి చూసి, తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని, మొదటి అయిదేళ్లలో  రాజ్యసభలో మెజార్టీ లేదు కాబట్టి దీనిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పుడు అన్ని పక్షాలు మద్దతు పలికాయి కాబట్టి చేపట్టామని చెప్పారు. 

కేవలం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగిస్తున్నామని చెబుతూ పార్లమెంటు బిల్లు పాస్‌చేసిన తర్వాత మళ్లీ పుల్వామా లాంటి దాడి జరగొచ్చని పాకిస్థాన్‌ చెప్పిందని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం తప్పితే మరో కారణం లేదని స్పష్టం చేసారు.

జమ్మూ-కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇప్పుడేమీ చర్యలు ఉండవు. దీనిపై కమిటీ వేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులో పెట్టిన సీట్ల పెంపునకు, జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లులో పెట్టిన సీట్ల పెంపునకు సంబంధంలేదని వివరించారు.  ఆర్టికల్‌ 370 కారణంగా 1976 తర్వాత అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరగలేదని చెప్పారు. 

2009లో ఏపీలో డీలిమిటేషన్‌ జరిగినా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన కారణంగా రాజకీయ కారణాలతో రెండు రాష్ట్రాల్లో సీట్లు పెంచాలని బిల్లులో పెట్టారు. జమ్మూ-కశ్మీర్‌లో సీట్ల పెంపు అంశం అక్కడ పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకున్నది.  దానిపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదు. ఏపీ, తెలంగాణల్లో 2026 లోపు సీట్ల పెంపుపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.