చంద్రబాబు ఫ్యామిలీ ఫంక్షన్ గా పోలవరం సందర్శన

అమరావతి శంకుస్థాపన తరహాలోనే పోలవరం ప్రాజెక్టు సందర్శన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ గా మార్చేశారు. పోలవరం గ్యాలరీని ప్రారంభించడాన్ని దాదాపుగా ప్రాజెక్ట్ నే ప్రరంభిస్తున్నంత హడావుడి చేసారు ముఖ్యమంత్రి. ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడైన మంత్రి నారా లోకేష్, కోడలు బ్రహ్మణి, మనుమడు దేవాన్ష్ లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ప్రాజెక్టుకు  సంబంధించి ప్రతి దశను చంద్రబాబు ఓ పండగలా చేస్తూ ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు పనులు  పూర్తి అయింది 55 నుంచి 60 శాతంలోపే. ఇప్పటికే చంద్రబాబు ఎన్నో జాతికి అంకితాలు, ప్రారంభోత్సవాలు అంటూ ఎన్నెన్నో సంబరాలు చేస్తూ కోట్లాది రూపాయలను మంచినీళ్ళ వలే ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టుకు  సంబంధించి ప్రతి దశను చంద్రబాబు ఓ పండగలా చేస్తూ ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. దేశంలో మరే ప్రాజెక్ట్ విషయంలో కూడా, ఏ ప్రభుత్వం కుడా ఇంతగా సంబరాల పేరుతో ప్రజాధనాన్ని వృదా చేస్తుండటం జరుగుతుందా ?

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి ప్రారంభించడం కీలకమైన అంశమే. అయితే దానికి కుడా ఇంత హడావుడి చేయాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఉత్సవంకు సంబంధించి స్థానిక మీడియాలో వచ్చే వార్తలు సరిపోవటం లేదన్నట్లు ఏకంగా ఢిల్లీ నుంచి కూడా మీడియాను రప్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులు సగం పూర్తి అయితేనే ఇంత హంగామా చేస్తుంటే ప్రాజెక్టు పూర్తి అయితే ఆయన మరింకా ఏమి చేస్తారో అర్థం కాకుండా ఉందని అంటూ టీడీపీ నాయకులే విస్తు పోతున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు కూడా చేశారు.

ఇట్లా ఉండగా, ముఖ్యమంత్రి మనుమడు నారా దేవాన్స్. తాను కడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు. నారా దేవాన్ష్ ఏంటి?. పోలవరం కట్టడం ఏంటీ అంటారా? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన మనవడిని ఏమి చేస్తున్నావని అడిగితే పోలవరం కడుతున్నానని చెప్పాడని వెల్లడించి ఈ మధ్య అందరి కళ్లు తెరిపించారు. ఆ వార్త పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. దేవాన్ష్ కట్టే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు చంద్రబాబు ఆయనతో కలసి హెలికాప్టర్ లో వెళ్లి చూసారని అనుకోవాలా ?

గత మూడు, నాలుగు నెలలుగా 55 శాతం నుండి 60 శాతం లోపే పనులు పూర్తి అవుతున్నట్లు చెబుతున్నారు. అంటే పెద్దగా పురోగతి లేదన్న మాట గదా. మరోవంక, ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకుండానే జిల్లాల నుండి ప్రత్యేక బసులు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వేల సంఖ్యలో `ఉచిత పర్యాటక’ సదుపాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కలిగిస్తున్నది. ఇదంతా రాజకీయ ప్రయోజనం ఉద్దేశించి, వచ్చే ఎన్నికలలో లబ్ది పొందటం కోసం ప్రజాధనాన్ని వృద్ద చేయడం మినహా మరేటువంటి ప్రయోజనం ఉండదు.

తమ ప్రభుత్వపు ఘనకార్యంగా ప్రచారం చేసుకోవాలి అనుకొంటే తెలుగుదేశం పార్టీ వనరులతో అటువంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చు. కాని అసలకే నిధుల కొరత, లోటు బడ్జెట్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ విధంగా దుబారా వ్యయం జత చేయడం బాధ్యతగల నేత ఎవ్వరైనా చేస్తారా ?