అరుణ్‌ జైట్లీకి తీవ్ర అస్వస్థత

బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు.  గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

రాత్రి ఎయిమ్స్‌ విడుదల చేసిన హెల్త్‌ బులెటెన్‌ లో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. ఈ రోజు ఉదయం ఆయన ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని పేర్కొంది.  

గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ బారిన పడినట్టు గతంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. 

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్‌ వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.

అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు హర్షవర్దన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, అశ్వని చౌబే తదితరులు ఎయిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.