బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ బిజెపిలో చేరారు. ఇవాళ దిల్లీలో బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు బిజెపిలోకి వస్తారని బిజెపి అధిష్ఠానానికి వివేక్‌ తెలిపినట్లు సమాచారం. 

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న కమలదళం.. దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది. పార్టీలో చేరిన తర్వాత వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నారని ఆరోపించారు.ఆయన నియంతృత్వ పోకడకు బిజెపి బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చలేదని మండిపడ్డారు.

నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడాలని ఆకాంక్షించారు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. పార్టీలో బలమైన, ఉద్యమ నేతలు ఉండకూడదనేది సీఎం ఉద్దేశమని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాలను చూసి ఇంకా చాలా మంది బిజెపిలో చేరుతారని చెప్పారు. 

మాజీ ఎంపీ వివేక్‌ను బిజెపిలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వివేక్‌ చేరికతో తెలంగాణ లోనూ బిజెపి బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.