ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేనే లేదు

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి ఏ కోశానా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా స్పెషల్ ప్యాకేజీ పేరిట ఏపీకి వివిధ రూపాల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో నిధులు సమకూరాయని తెలిపారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం తమపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రజల నుంచి మళ్లించే యత్నం చేసిందని ఆరోపించారు. ఏపీకీ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులు మంజూరు విషయంలో ఎటువంటి వివక్ష చూపలేదని, సముచిత న్యాయమే చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని అంగీకరించారు.

వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా మోదీ ప్రభుత్వంపై వారిలో నమ్మకాన్ని పెంచడానికి పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టిందని చెప్పారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేదికగా మోదీ ప్రభుత్వం ఏపీకి గత ఐదేళ్ల కాలంలో సమకూర్చిన నిధులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించే బాధ్యతను పార్టీశ్రేణులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే పదేళ్లపాటు ఉంటూ అమరావతిలో దశలవారీగా వౌలిక వసతులను సమకూర్చుకునే సౌలభ్యం చట్టప్రకారంగా ఉందని గుర్తు చేశారు. అయితే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణా సీఎంకు భయపడి అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించి రాష్ట్రం తరలింపునకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.

ఓటమి బాధతో టీడీపీ, గెలిచామనే ఆనందం లేక జగన్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నాయని కన్నా దయ్యబట్టారు. నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశ రక్షణకు వారు చేపడుతున్న కృషికి ప్రజలు హర్షధ్వానాలు పలుకుతున్నారని కొనియాడారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, పాకిస్థాన్ ఆటలు ఇకపై సాగబోవని ఆర్టికల్ 370 రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసిందని చెప్పారు.